Trump-Putin: ఉక్రెయిన్ యుద్ధంపై నేడు ట్రంప్-పుతిన్ చర్చలు
సంభాషణకు ముందు ట్రంప్ కీలక పోస్ట్;
ఉక్రెయిన్‌పై యుద్ధం ముగించడానికి ఇప్పటికే శాంతి చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. సౌదీ అరేబియా వేదికగా రష్యాతో అమెరికా అధికారులు చర్చలు జరిగించాయి. పలుమార్లు జరిగిన చర్చల్లో కీలక పురోగతి లభించింది. ఇక మంగళవారం మరొక కీలక అడుగుపడనుంది. ఇక ఇదే అంశంపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్-రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్‌లో సంభాషించనున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్‌తో మంగళవారం మాట్లాడుతున్నట్లు తెలిపారు.
తాను అధికారంలోకి వస్తే ఉక్రెయిన్ యుద్ధం ముగిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పారు. అన్నట్టుగానే 30 రోజుల కాల్పుల విరమణను ప్రతిపాదించారు. దీనికి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించారు. పుతిన్ అంగీకారం తెలుపుతూనే కొన్ని అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని.. వాటిపై తాను అమెరికాతో మాట్లాడతానని తెలిపారు. మొత్తానికి మంగళవారం ఇద్దరు అధ్యక్షుల సంభాషణతో యుద్ధానికి ఒక ఫుల్‌స్టాప్ పడే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పుతిన్‌తో సంభాషణకు ముందు ట్రంప్ ఆసక్తికర పోస్ట్ చేశారు. తుది ఒప్పందంలోని చాలా అంశాలపై అంగీకారం కుదిరిందని, ఇంకా చాలా మిగిలి ఉన్నాయని ట్రూత్‌లో ట్రంప్ పేర్కొన్నారు.