Howard Lutnick: రెచ్చిపోయిన అమెరికా కామర్స్ మంత్రి, విధానాలు మార్చుకోకపోతే పరిణామాలు తప్పవని వార్నింగ్

అమెరికా మార్కెట్‌ను భారత్ దుర్వినియోగం చేస్తోందని ఆరోపణ

Update: 2025-09-29 01:01 GMT

అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ భారత్‌ను ఉద్దేశించి తీవ్రమైన హెచ్చరికలు చేశారు. "మా గురించి మాట్లాడేటప్పుడు భారత్, బ్రెజిల్ వంటి దేశాలు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మళ్లీ రాజుకునేలా ఉన్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన లుట్నిక్, అమెరికా మార్కెట్‌ను భారత్ తన స్వప్రయోజనాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. "భారత్ వెంటనే తన మార్కెట్లను పూర్తిగా అందుబాటులో ఉంచాలి. అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగించే విధానాలను తక్షణమే విరమించుకోవాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది" అని ఆయన హెచ్చరించారు. స్విట్జర్లాండ్, బ్రెజిల్‌తో పాటు భారత్‌ను కూడా అమెరికా 'సరిచేయాల్సిన' దేశాల జాబితాలో చేర్చడం గమనార్హం.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత భారత్.. రష్యా నుంచి రాయితీపై ముడి చమురు దిగుమతులను భారీగా పెంచడాన్ని కూడా లుట్నిక్ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది అమెరికా విధానాలకు పూర్తిగా విరుద్ధమని ఆయన అన్నారు. ఇప్పటికైనా భారత్ ఎవరి పక్షాన నిలబడాలో స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో వాణిజ్య ఒప్పందాలపై దాని ప్రభావం పడుతుందని పరోక్షంగా సూచించారు.

లుట్నిక్ వ్యాఖ్యలు ట్రంప్ అనుసరించే 'అమెరికా ఫస్ట్' విధానాలకు అద్దం పడుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

Tags:    

Similar News