JD Vance: భారత పర్యటనకు రానున్న అమెరికా ఉపాధ్యక్షుడు

యూఎస్-ఇండియా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ట్రిప్‌కి ప్రాధాన్యం..;

Update: 2025-04-12 00:00 GMT

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్ 21-24 మధ్య భారత్ సందర్శించవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఉపాధ్యక్షుడి భార్య ఉషా వాన్స్ కూడా ఆయన వెంట ఉండనున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో ప్రధాని నరేంద్రమోడీ, ఇతర సీనియర్ అధికారులతో సమావేశాలు ఉంటాయని, అధికారిక కార్యక్రమాలతో పాటు జైపూర్, ఆగ్రాలను సందర్శించవచ్చని తెలుస్తోంది.

అమెరికా జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) మైక్ వాల్ట్జ్ కూడా వీరితో పాటు భారత పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఉషా వాన్స్ భారత సంతతి అమెరికన్. ఆమె అమెరికా రెండో మహిళగా తన స్వదేశానికి మొదటిసారిగా వస్తోంది. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం చర్చలు జరుగుతున్న నేపథ్యంలో జేడీ వాన్స్ భారత్ పర్యటనకు రానున్నట్లు తెలుస్తోంది.

తెలుగు మూలాలున్న ఉష సెకండ్‌ లేడీ హోదాలో తన పూర్వీకుల దేశానికి రానుండటం ఇదే తొలిసారి. ఉష చిలుకూరి అమెరికాలో పుట్టిన తెలుగమ్మాయి అన్న సంగతి తెలిసిందే. ఆమె పూర్వికులది ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికా వలసవెళ్లారు. కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో ఉషా చిలుకూరి పుట్టి పెరిగారు. యేల్‌ యూనివర్సిటీ నుంచి చరిత్రలో బ్యాచిలర్‌ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి తత్వశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విభాగాల్లో సుదీర్ఘకాలం పనిచేశారు.

యేల్‌ లో ఉషా, జేడీ వాన్స్‌  తొలిసారి కలుసుకున్నారు. వారి పరిచయం ప్రేమగా మారి.. 2014లో కెంటకీలో వారు వివాహం చేసుకున్నారు. హిందూ సంప్రదాయంలో వీరి వివాహం జరగడం విశేషం. వీరికి ముగ్గురు సంతానం. రాజకీయాల్లో వాన్స్‌కు ఉష అడుగడుగునా అండగా నిలబడ్డారు. గతేడాది ఎన్నికల సమయంలోనూ వాన్స్‌ తరఫున చురుగ్గా ప్రచారం చేసి ఆమె మీడియా దృష్టిని ఆకర్షించారు.

Tags:    

Similar News