Donald Trump: ట్రంప్ ఈజ్ డెడ్ అని వైరల్ చేసుకుంటున్న అమెరికన్లు
స్పందించిన యూఎస్ ఉపాధ్యక్షుడు ..
గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం గురించి చాలా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ చర్చలకు ఓ కారణం ఉంది. ఇటీవల దక్షిణ కొరియా అధ్యక్షుడు లీజే మ్యుంగ్‌తో జరిగిన సమావేశంలో, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేతిపై నీలిరంగు గుర్తు కనిపించింది. ఎప్పుడు ఆయన చేతిపై ఈ గుర్తును ప్రపంచం చూసిందో అప్పటి నుంచి ట్రంప్ ఆరోగ్యంపై జోరుగా ప్రచారం జరగడం ప్రారంభం అయ్యింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ట్రంప్ చాలా రోజులుగా బహిరంగంగా కనిపించలేదు. దీనికి అదనపు బలం తోడైనట్లు వైట్ హౌస్ పై అమెరికన్ జెండా సగం ఎత్తులో ఎగురవేశారు. ఇవన్నీ కలవడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఊహాగానాలు పెరిగిపోయాయి. ఆ తర్వాత ఏకంగా #TrumpIsDead అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం ప్రారంభించింది.
ఇక్కడ వాస్తవం వేరేలా ఉంది. మీకు తెలుసో లేదో.. అమెరికాలో ఒక సంప్రదాయం ఉంది. ఏదైనా పెద్ద ప్రమాదం లేదా విషాదం జరిగినప్పుడు, ఆ దేశ జాతీయ జెండాను సగం ఎత్తుకు దించి సంతాపం ప్రకటిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ జరిగింది అదే. మిన్నియాపాలిస్ చర్చిలో జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా, 17 మంది గాయపడ్డారు. దీంతో ట్రంప్ ఆదేశాల మేరకు, దాడికి సంతాపంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ భవనాలపై ఉన్న జెండాను ఆగస్టు 31 వరకు సగం ఎత్తుకు దించారు. ఇదీ అసలు సంగతి. ట్రంప్ ఆరోగ్యంపై అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ కూడా ఒక ప్రకటనలో స్పందించారు. అధ్యక్షుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని, తన పదవీకాలాన్ని పూర్తి చేస్తారని అన్నారు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ఎదుర్కోడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు, కానీ ట్రంప్ కచ్చితంగా తన అద్భుతమైన పనిని కొనసాగిస్తారని, అమెరికన్ ప్రజలకు సేవ చేస్తూనే ఉంటారని స్పష్టం చేశారు.
ట్రంప్ ఆరోగ్యం గురించి ఆయన వ్యక్తిగత వైద్యుడు షాన్ బార్బబెల్లా స్పష్టత ఇచ్చారు. అధ్యక్షుడి చేతిపై కనిపించే గుర్తు ఏ తీవ్రమైన వ్యాధికి సంకేతం కాదని చెప్పారు. ఇది చిన్న మృదు కణజాల చికాకు, ఇది తరచుగా ఎక్కువగా కరచాలనం(షేక్‌హ్యాండ్) చేయడం, ఆస్పిరిన్ వంటి మందులు తీసుకోవడం వల్ల వస్తుందన్నారు. దేశాధ్యక్షుడి మానసిక, శారీరక ఆరోగ్యం చాలా బాగుందని వెల్లడించారు.