US: డ్రంకెన్‌ డ్రైవింగ్‌లో దొరికితే వీసా రద్దు

అమెరికాలో నిబంధనలు మరింత కఠినతరం;

Update: 2025-04-02 23:59 GMT

 ట్రంప్‌ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఏదో ఒక వంకతో విదేశీయులను వెనక్కి తిప్పి పంపుతున్నారు అమెరికా అధికారులు. విద్యార్థి లేదా వర్క్‌ వీసాపై ఉన్న వారు డ్రంకెన్‌ డ్రైవింగ్‌లో దొరికితే వెంటనే వారి వీసా రద్దు చేస్తున్నారు. తాజాగా మిన్నెసోటా యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థి వీసాను అధికారులు ఇదే కారణంగా రద్దు చేశారు. ఎఫ్‌-1 వీసాపై మినియాపొలిస్‌ బిజినెస్‌ స్కూల్‌లో చదువుతున్న ఆ విద్యార్థిని ఇమిగ్రేషన్‌ అధికారులు గత గురువారం అరెస్టు చేశారు. ఇటీవల పాలస్తీనాకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించిన వారిని సైతం అధికారులు వీసా రద్దుచేసి వారి స్వదేశాలకు పంపించారు. ఇది కూడా అలాంటి అరెస్టేనని భావించిన ఇతర విద్యార్థులు నిరసన ప్రదర్శనలకు దిగారు. అయితే ఇది రాజకీయ సంబంధమైనది కాదని, మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసినందుకు వీసాను రద్దు చేశామని అమెరికా హోంశాఖ వివరణ ఇచ్చింది. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ కేసులో దోషిగా నిర్ధారణ కాకపోయినా, కేవలం అరెస్టయినా సరే వీసా రద్దయ్యే అవకాశం ఉంటుందని, కాబట్టి విద్యార్థులు, వర్క్‌ వీసాపై వచ్చినవారు జాగ్రత్తగా ఉండాలని న్యాయ నిపుణుడు కేతన్‌ ముఖీజా సూచించారు. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ కేసుల్లో ఒకటి కన్నా ఎక్కువ సార్లు దొరికితే శాశ్వత పౌరసత్వం లభించిన వారి వీసాలు సైతం రద్దయ్యే అవకాశం ఉన్నదని మరో ఇమిగ్రేషన్‌ నిపుణుడు అజయ్‌శర్మ చెప్పారు. పాలస్తీనాకు మద్దతు తెలుపుతూ జరిగిన ప్రదర్శనలలో పాల్గొన్న సుమారు 300 మంది వీసాలు ఇటీవలి కాలంలో రద్దయ్యాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

విద్యార్థులపై ఏఐతో నిఘా

హమాస్‌, ఇతర ఉగ్రవాద సంస్థలకు మద్దతిచ్చే విదేశీ విద్యార్థులను గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం కృత్రిమ మేధ ను (ఏఐ) ఉపయోగిస్తున్నది. విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను ఏఐ సాయంతో తనిఖీ చేస్తున్నది. పాలస్తీనా అనుకూల ఉద్యమాలు, యూదు వ్యతిరేక కార్యకలాపాలపై ట్రంప్‌ అడ్మినిస్ట్రేషన్‌ చేపడుతున్న కఠిన చర్యల్లో భాగంగా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎఫ్‌1, ఎం1, జే1 వీసాలను రద్దు చేసినట్లు వందలాది మంది విదేశీ విద్యార్థులకు ఈ-మెయిళ్లను పంపించింది. స్వయంగా దేశం విడిచి వెళ్లిపోవాలని ఆదేశించింది. మూడు వారాల్లో 300 మంది విద్యార్థుల వీసాలను ఈ విధంగా రద్దు చేసింది.

Tags:    

Similar News