Vivek Ramaswamy: దూసుకుపోతున్న వివేక్ రామస్వామి
రిపబ్లికన్ పార్టీలో రసవత్తరంగా మారిన పోరు.... ట్రంప్, డిశాంటిస్‌లకు తగ్గుతున్న మద్దతు... వివేక్‌కు పెరుగుతున్న ప్రజాదరణ...;
అమెరికాలో అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీలో పోరు రసవత్తరంగా మారింది. . వచ్చే ఏడాది జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల (US presidency) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడే అభ్యర్థుల్లో భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) దూసుకుపోతున్నారు. ఇవాళ తొలి చర్చా వేదిక జరగనున్న నేపథ్యంలో పోటీపడే వారిపై పలు వార్తా సంస్థలు పోల్స్ నిర్వహించాయి. వాటిలో అగ్రస్థానంలో ఉన్న మాజీ అధ్యక్షుడు ట్రంప్(trump) , రెండో స్థానంలో ఉన్న డిశాంటిస్ లకు మద్దతు తగ్గుతుండగా భారతీయ సంతతికి చెందిన వివేక్ రామస్వామి క్రమంగా తన మద్దతును పెంచుకుంటున్నారు.
ఫాక్స్ న్యూస్ సర్వే(fox news survey)లో రామస్వామికి మద్దతు పెరిగినట్లు తేలింది. గత జూన్ తో పోలిస్తే..ఆయనకు మద్దతిచ్చే పార్టీ సభ్యుల సంఖ్య దాదాపు రెట్టింపైంది. ఓ సర్వేలో ఏకంగా డిశాంట్ తో సమానంగా వివేక్ కు పార్టీ సభ్యుల మద్దతు లభించిందని తెలుస్తోంది. రామస్వామి ప్రసంగాలు క్రమంగా అమెరికా ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయని. తెలుస్తోంది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఓటర్లు, 35 ఏళ్ల లోపు వయసున్న వారి మద్దతు కూడగట్టడంలో వివేక్ రామస్వామి మంచి పురోగతి సాధిస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. తన రాజకీయ ప్రచారం ‘న్యూ అమెరికన్ డ్రీమ్( new american dream)పై రామస్వామి దృష్టి సారించారు. ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్(elon musk) ఇటీవల ఆయన మాటలకు ఫిదా అయ్యారు. రామస్వామికి మద్దతు ప్రకటించారు. ఆయనను చాలా సమర్ధవంతమైన అభ్యర్థిగా మస్క్ అభివర్ణించారు.
తొలి చర్చలో రామస్వామి ఎలా మాట్లాడతారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. అధ్యక్ష అభ్యర్థిత్వానికి సంబంధించిన రేసులో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, హర్ష్ వర్దన్ సింగ్ కూడా పోటీలో ఉన్నారు. ట్రంప్ మొదటి స్థానంలో కొనసాగుతున్నప్పటికీ ఆయనపై ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా రెండో స్థానంలోని రామస్వామికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ (Joe Biden)పై పోటీలో నిలిచే అవకాశం ఆయనకే ఉంటుందని భావిస్తున్నారు.
తాను కేవలం అధ్యక్ష అభ్యర్ధిగానే పోటీపడతానని, వైస్-ప్రెసిడెంట్ అభ్యర్ధిత్వంపై తనకు ఆసక్తి లేదని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. అధ్యక్ష అభ్యర్ధిగా విఫలమైతే తాను ఉపాధ్యక్ష పదవికి పోటీ పడనని తేల్చి చెప్పారు. డొనాల్డ్ ట్రంప్, తాను నంబర్ 2 స్థానంలో రాణించలేమని వివేక్ రామస్వామి తేల్చి చెప్పారు.