Mercy killing: భార్యతో కలిసి డచ్ మాజీ ప్రధాని స్వచ్ఛంద మరణం
చేతిలో చెయ్యేసి ఒకరినొకరు చూసుకుంటూ;
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రయెస్ వ్యాన్ అగ్ట్, ఆయన భార్య ఇజెనీ చావులోనూ చేయి వీడలేదు. ఈ నెల 5న వారు తమ నిజ్‌మెజెన్‌లో కారుణ్య మరణం పొందినట్టు అగ్ట్ ప్రారంభించిన మానవహక్కుల సంఘం వెల్లడించింది. అగ్ట్, ఇజెనీ ఇద్దరూ 70 ఏళ్లకు పైగా దాంపత్య జీవితాన్ని అనుభవించారు. మాజీ ప్రధాని దంపతులిద్దరూ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరూ చట్టపరమైన హక్కు అయిన కారుణ్య మరణాన్ని కోరుకున్నారు.
అగ్ట్ 2019లో బ్రెయిన్ హేమరేజ్ బారినపడ్డారు. చికిత్స తీసుకున్నప్పటికీ ఆయన దానిని నుంచి పూర్తిగా కోలుకోలేకపోయారు.ఇద్దరూ ఒకరిని విడిచి మరొకరు జీవించలేమని నిర్ణయించుకుని కారుణ్య మరణాన్ని ఎంచుకుని 70 ఏళ్ల పైబడిన దాంపత్య జీవితానికి ముగింపు పలికారు.
ఇటీవలి కాలంలో నెదర్లాండ్స్‌లో కారుణ్య మరణాలు ఎంచుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2002లో అక్కడ కారుణ్య మరణం చట్టబద్ధమైంది. అయితే, చట్టబద్ధంగా కారుణ్య మరణాన్ని ఎంచుకునే వారు అందుకు తగిన కారణాన్ని చూపించాల్సి ఉంటుంది. అంటే భరించలేని బాధలు, ఉపశమనం పొందే అవకాశం లేకపోవడం, దీర్ఘకాలంగా మరణం కోసం ఎదురుచూస్తుండడం వంటి కారణాలు చూపాల్సి ఉంటుంది.
కారుణ్య మరణం చట్టబద్ధమైన తర్వాత నుంచి డచ్‌లో ఇలాంటి కేసులు నాలుగింతలు పెరిగాయి. 2021లో 16 జంటలు కారుణ్య మరణం ద్వారా ప్రాణాలు విడిచిపెడితే 2022లో ఆ సంఖ్య 29కి పెరిగింది. 2020లో 13 జంటలు కారుణ్య మరణాన్ని ఎంచుకున్నాయి.