John F Kennedy: కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం?
ట్రంప్ యంత్రాంగం విడుదల చేసిన రహస్య పత్రాల్లో వెల్లడైన కీలకాంశం;
అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ హత్యలో అమెరికా నిఘా సంస్థ సీఐఏ హస్తంపై ట్రంప్ సర్కారు తాజాగా విడుదల చేసిన రహస్య దస్ర్తాలు అనుమానం వ్యక్తం చేశాయి. కెనడీ హత్య వెనుక సీఐఏ హస్తం ఉండొచ్చని మొదటి నుంచి సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సీఐఏ పాత్రను నేరుగా వెల్లడించనప్పటికీ హత్యకు సంబంధించి ముందస్తు హెచ్చరికలను సీఐఏ నిర్లక్ష్యం చేసిందని రహస్య దస్ర్తాలు నిందించాయి. 1963లో కెనడీ డల్లాస్‌లో హత్యకు గురయ్యారు. కాన్వాయ్‌లో వెళుతున్న కెనడీపై కాల్పులు జరపడంతో ఆయన మరణించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో విడుదలైన రహస్య పత్రాల్లో సీఐఏ పాత్రకు సంబంధించిన ప్రస్తావనలూ ఉన్నాయి. 63 వేల పేజీలతో కూడిన 2,200 దస్త్రాలను యూఎస్ నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్.. తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 1961లో అమెరికా 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన జాన్ ఎఫ్.కెనడీ.. 1963 నవంబరు 22న డాలస్‌లో హత్యకు గురయ్యారు. కాన్వాయ్‌లో ఆయన ప్రయాణిస్తుండగా.. దుండగుడు వెనక నుంచి కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్టు చేయగా.. కేసు దర్యాప్తు సమయంలో అతడు కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తిని అరెస్టు చేసి శిక్ష వేయగా.. కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్‌తో మరణించాడు. నాటినుంచి కెనడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది.