Ebrahim Raisi: రైసీ మృతితో ఇరాన్‌లో సంబరాలు..
బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్న ఇరానియన్లు.. !;
ఇరాన్ దేశంలో విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ (హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే అధ్యక్షుడి మరణ వార్త తెలుసుకున్న ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి , మందు పార్టీతో రైసీ మృతిని సెలబ్రేట్ చేసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
ఇబ్రహీం రైసీ మృతి వార్త తెలియగానే ఇరాన్‌లో వందలాది మంది ప్రజలు టెహ్రాన్, మషాద్‌లోని ప్రధాన కూడళ్లలో గుమిగూడి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు. ఇక విదేశాల్లో ఉన్న ఇరానీయులు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. లండన్‌లో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ రాయబార కార్యాలయం ముందు కొందరు ఇరానీయులు వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కొందరు స్వీట్లు పంచారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సంబరాలపై మహిళా హక్కుల కార్యకర్త మాసిహ్ అలినేజాద్ ఎక్స్ వేదిగా స్పందించారు. ఈ ప్రమాదంలో ఎవరైనా ప్రాణాలతో బయటపడితే చరిత్రలో ఆందోళన కలిగించే ఏకైక క్రాష్ ఇదే అవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ హెలికాప్టర్ డే శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. కాగా, రైసీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత చాలా క్రూరంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇస్లామిక్ అచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెబుతున్నారు. ఇరాక్-ఇరాన్ యుద్ధ సమయంలో చిక్కిన ఖైదీలను రైసీ దారుణంగా ఉరి వేయించాడని, ఆయన నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారిని కూడా రైసీ కఠినంగా శిక్షించినట్ల ఆరోపణలు ఉన్నాయి. రైసీ పట్ల ఇరాన్ ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు స్థానిక మీడియాలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మృతిని ఇరాన్ ప్రజలు ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.
హిజాబ్ విషయంలో 2022లో అక్కడ ఏ స్థాయిలో గొడవలుజరిగాయో ప్రపంచం అంతా గమనించింది. వేలాది మందిని జైళ్లలో బంధించారు. రోడ్లపైకి వచ్చి హిజాబ్‌కి వ్యతిరేకంగా నినదించిన మహిళలపైనా దాడులు చేశారు. అప్పటి నుంచి ఇరాన్ వార్తల్లో నిలుస్తూనే ఉంది. చాలా మంది మహిళలు ఇబ్రహీం రైసీ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆయన చనిపోయారనగానే అందుకే వాళ్లంతా సెలబ్రేట్ చేసుకున్నారు. కేవలం హిజాబ్ గురించే కాదు. భావ ప్రకటనా స్వేచ్ఛనీ రైసీ అణిచివేశారన్న ఆరోపణలున్నాయి. మహిళల దుస్తుల విషయంలో చాలా దారుణంగా వ్యవహరించడం, పోలీసులకు మితిమీరిన అధికారులు ఇవ్వడం లాంటివీ విమర్శలకు తావిచ్చాయి. ఇక 1988లో డిప్యుటీ ప్రాసిక్యూటర్‌గా పని చేసిన రైసీ జైల్లో ఉన్న రాజకీయ నేతల్ని ఉరి తీయడంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి నుంచి ఆయనకు Butcher of Tehran అనే చెడ్డ పేరు వచ్చింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న 5 వేల మందిని కిడ్నాప్ చేయించి వాళ్లందరినీ ఉరి తీయించారన్న ఆరోపణలూ ఉన్నాయి. ప్రస్తుత ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్ల గైడెన్స్‌లో రాజకీయ నేతగా ఎదిగిన ఇబ్రహీం రైసీపై ఇప్పటికీ కొన్ని వర్గాలు తీవ్ర అసహనంతో ఉన్నాయి.