Secret Service: ట్రంప్ భద్రతలో వైఫల్యం..
'సీక్రెట్ సర్వీస్' డైరెక్టర్ రాజీనామా
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం వ్యవహారంలో సీక్రెట్ సర్వీస్ పనితీరుపై తీవ్ర విమర్శల నేపథ్యంలో ఆ సంస్థ డైరెక్టర్ కింబర్లీ కియాటిల్ రాజీనామా చేశారు. ఇటీవలి కాలంలో సీక్రెట్ సర్వీస్ అతిపెద్ద వైఫల్యమని అంగీకరించిన కియాటిల్, తన బాధ్యతల నుంచి వైదొలిగారు. ఈ వ్యవహారంలో ఏజెన్సీ తరఫున భద్రత లోపాలకు తనదే పూర్తి బాధ్యతని ఆమె ఒప్పుకున్నారు. మరోవైపు పెన్సిల్వేనియాలో ట్రంప్‌పై కాల్పుల ఘటన సీక్రెట్ సర్వీస్ తీవ్ర వైఫల్యమేనని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది. కాల్పుల ఘటనపై అమెరికా కాంగ్రెస్ ఇటీవల జరిపిన విచారణకు కింబర్లీ కియాటిల్ హాజరై, కమిటీ సభ్యుల ఎదుట ఆమె వివరణ ఇచ్చారు. సాయుధ దుండగుడు అత్యంత సమీపానికి ఎలా రాగలిగారని ప్రశ్నిస్తూ ఆమెపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీక్రెట్ సర్వీసెస్‌కు రాజీనామా చేయాలని డిమాండ్ వచ్చిన నేపథ్యంలో కింబర్లీ కియాటిల్ తాజాగా నిర్ణయాన్ని ప్రకటించారు.