Meloni-Erdogan : సిగరెట్ మానేయమని మెలోనీకి ఎర్డోగన్ సూచన , అసాధ్యం అన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు, అవునన్న మెలోనీ
గాజా శాంతి సదస్సులో ప్రపంచ నేతల మధ్య ఆసక్తికర సంభాషణ
ప్రపంచ రాజకీయాలు, యుద్ధ వాతావరణం వంటి తీవ్రమైన అంశాలపై చర్చించేందుకు సమావేశమైన ప్రపంచ నేతల మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ధూమపానం అలవాటుపై తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలు, దానికి ఆమె ఇచ్చిన చమత్కార సమాధానం ఆసక్తికరంగా మారింది.
వివరాల్లోకి వెళితే... గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు ఈజిప్టులోని షార్మ్ ఎల్-షేక్‌లో శాంతి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు హాజరైన నేతలు అనధికారికంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఎర్డోగాన్, ఇటలీ ప్రధాని మెలోనీ వద్దకు వచ్చి మాట్లాడారు. ఇహ్లాస్ న్యూస్ ఏజెన్సీ ప్రసారం చేసిన వీడియో ఫుటేజ్ ప్రకారం, "విమానం నుంచి దిగుతున్నప్పుడు మిమ్మల్ని చూశాను. మీరు చాలా బాగున్నారు. కానీ, మీ చేత పొగతాగడం కచ్చితంగా మాన్పించాలి" అని ఎర్డోగాన్ ఆమెతో అన్నారు.
ఎర్డోగాన్ మాటలు వినగానే పక్కనే ఉన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ నవ్వుతూ జోక్యం చేసుకున్నారు. "అది అసాధ్యం!" అని ఆయన సరదాగా వ్యాఖ్యానించారు. దీనికి మెలోనీ కూడా అంతే చమత్కారంగా బదులిచ్చారు. "నాకు తెలుసు. కానీ నేను స్మోకింగ్ మానేస్తే, నాకు చిరాకు ఎక్కువై ఎవరినైనా ఏమైనా అనేస్తానేమో" అంటూ ఆమె నవ్వేశారు.
తుర్కియేని పొగాకు రహిత దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఎర్డోగాన్ చాలాకాలంగా గట్టి ప్రచారం చేస్తున్నారు. "పొగ రహిత తుర్కియే" పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. మరోవైపు ఇతర దేశాధినేతలతో సత్సంబంధాలు పెంచుకోవడానికి ధూమపానం తనకు ఉపయోగపడిందని మెలోనీ గతంలో ఓ పుస్తకంలో పేర్కొనడం గమనార్హం. గాజాలో కాల్పుల విరమణ, దీర్ఘకాలిక శాంతి స్థాపన వంటి కీలక అంశాలపై చర్చించేందుకు జరిగిన ఈ సదస్సులో ఈ సరదా సంభాషణ ప్రత్యేకంగా నిలిచింది.