ఆత్మహత్య ఘటనలో.. ఎస్‌ఐ సస్పెండ్

బనగానపల్లె ఆత్మహత్య ఘటనలో ..ఎస్‌ఐ శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేశారు జిల్లా ఎస్పీ. దీంతో మృతుని బంధువులు ఆందోళన విరమించారు. ఆత్మహత్యకు పాల్పడిన దస్తగిరి మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించేందుకు స్వగ్రామం చిన్నరాజు పాలెంకు బంధువులు తరలించారు. ఘటనపై పూర్తి దర్యాప్తు చేపట్టి శంకర్ నాయక్‌పై చర్యలు తీసుకుంటామని ఎస్పీ రఘువీర్ రెడ్డి స్పష్టం చేశారు.
నంద్యాల జిల్లా బనగానపల్లెలో ఓ అప్పు విషయంలో పోలీసులు స్టేషన్‌కు పిలిపించి ఎస్‌ఐ శంకర్ నాయక్ దుర్భాషలాడారని బాధితులు ఆరోపించారు. పోలీసుల తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి, కొడుకు పోలీస్ స్టేషన్ ఎదుటే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఘటనలో కుమారుడు దస్తగిరి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా....తల్లి గుర్రమ్మ పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రాత్రి నుంచి మృతుడి బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు.
బంధువులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో గ్రామస్తులు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎస్‌ఐ శంకర్ నాయక్, ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేయాలని, రిమాండ్‌కు తరలించాలని బాధితుల బంధువులు డిమాండ్ చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకునేవరకు మృతదేహాన్ని తరలించేది లేదని భీష్మించారు. పరిస్థితి అదుపు తప్పే సూచనలు కన్పించడంతో అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా పోలీసులు మోహరించారు. ఎట్టకేలకు .ఎస్‌ఐ శంకర్ నాయక్‌ను సస్పెండ్ చేయడంతో శాంతించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com