కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ హైకోర్టుకు హాజరు

కోర్టు ధిక్కరణ కేసులో ఏపీ డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హైకోర్టు విచారణకు హాజరయ్యారు. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిన హైకోర్టు విచారణను మార్చి 20కి వాయిదా వేసింది. మాజీ డీజీపీ, ప్రస్తుత ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ కూడా కోర్టుకు రావాల్సి ఉంది. అయితే కేరళలో సమావేశానికి హాజరైనందున రాలేకపోతున్నందుకు మన్నించాలని కోరారు. తదుపరి విచారణకు హాజరవుతానని అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు సానుకూలంగా స్పందించింది.
1999లో జారీ చేసిన జీవో 257 ప్రకారం విజయనగరం జిల్లా పోలీసు శిక్షణ కళాశాలలో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సీహెచ్ రాజశేఖర్‌కు పదోన్నతి కల్పించే వ్యవహారాన్ని పరిగణనలోకి తీసుకోవాలని 2019 సెప్టెంబరు 24న హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో రాజశేఖర్ కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు. ఇటీవల దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్వ డీజీపీ, ప్రస్తుత డీజీపీలు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో విచారణకు ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథరెడ్డి హాజరయ్యారు. కౌంటర్ వేసేందుకు సమయం ఇస్తూ విచారణను వాయిదా వేశారు. తదుపరి విచారణకు హాజరు నుంచి డీజీపీ రాజేంద్రనాథరెడ్డికి మినహాయింపు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com