ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ ఝలక్‌

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్‌ సర్కార్‌ ఝలక్‌
లోన్లు, అడ్వాన్సులూ ఇవ్వకూడదని నిర్ణయం

ఏపీలో జగన్‌ సర్కారు ప్రభుత్వ ఉద్యోగులకు మరో ఝలక్‌ ఇచ్చింది. ఇకపై లోన్లు, అడ్వాన్సులూ ఇవ్వకూడదని నిర్ణయించింది. వీటి బాధ్యత బ్యాంకులకు అప్పగించింది. ఈ మేరకు జీవో జారీచేసింది సర్కారు. ఉద్యోగులకు లోన్లు, అడ్వాన్సులు ప్రభుత్వమే ఇచ్చేది. పెళ్లి, ఇంటి కొనుగోలు, మొబైల్‌, ల్యాప్‌టాప్‌, వాహనాల కొనుగోలు కోసం ప్రభుత్వం ముందుగానే అడ్వాన్సు ఇచ్చేది. ఈ మొత్తంపై తక్కువ వడ్డీకి అంటే 6 నుంచి 7 శాతం వరకు వడ్డీతో ఆ మొత్తాన్ని ఉద్యోగి జీతం నుంచి నెలనెల కట్‌ చేసేది. కానీ దీనికి ఎసరుపెట్టింది జగన్‌ సర్కారు.

జగన్‌ సర్కారు వచ్చిన తొలి 6 నెలలు బాగానే ఉన్నా ఆ తర్వాత నుంచి ఉద్యోగులకు లోన్లు, అడ్వాన్సులు ఇవ్వడం ఆపేశారు. ఇక ఇప్పుడు ఆ బాధ్యతను బ్యాంకులకు అప్పజెబుతూ జీవో ఇచ్చారు. 2022 రివైజ్డ్‌ పేస్కేల్స్‌ నిబంధనల ప్రకారం ఉద్యోగులకు లోన్లు, అడ్వాన్సులు ఇచ్చే అంశాన్ని పరిశీలించి తగు సిఫారసులు చేసేందుకు కమిటీని నియమిస్తున్నట్టు అందులో పేర్కొంది. ఉద్యోగుల డిమాండ్లలో ఈ సమస్య కూడా ఉంది. ఉద్యోగుల నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుండడంతో ఇప్పుడు పూర్తిగా ఆ బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులను బ్యాంకులకు టైఅప్‌ చేసి వాటి ద్వారా లోను ఇప్పించాలని నిర్ణయించింది. అందుకే దీనిపై సిఫారసులు చేయాలని వైద్యఆరోగ్యశాఖ, వ్యవసాయ శాఖ, హోం శాఖ, ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖ, పాఠశాల విద్యాశాఖల కార్యదర్శులతో కమిటీ వేసింది.

అయితే, బ్యాంకులు ప్రభుత్వం ఇచ్చినట్టుగా 6 నుంచి 7 శాతం వడ్డీకి ఉద్యోగులకు లోన్లు ఇచ్చే అవకాశమే లేదు. సాధారణ కస్టమర్లలాగానే ప్రభుత్వ ఉద్యోగులకూ ఎక్కువ వడ్డీరేటేకే లోన్లు తీసుకోవాలి. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులకు తీవ్ర నష్టం కలిగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం తమ కక్షతో వ్యవహరిస్తోందని భావిస్తున్నారు ఉద్యోగులు. ఈ తాజా నిర్ణయంతో.. సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు ఉద్యోగులు.

Tags

Read MoreRead Less
Next Story