నేటి నుంచి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన

పీఆర్సీతో పాటు పలు సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుంచి ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. జగన్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపినా అవి ఫలించలేదు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఏపీ జేఏసీ ఆరోపించింది. ఏపీ జేఏసీ తరపున ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టనున్నట్టు స్పష్టం చేసింది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సీపీఎస్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఈహెచ్‌ఎస్ వంటి సమస్యలపై క్లారిటీ ఇవ్వడంలేదని జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. వీటితో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్‌ఐ వంటి మరిన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.
దశలవారీగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని, పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఏపీ జేఏసీ వెల్లడించింది. జీవోఎం సమావేశంలోనూ ఉద్యోగుల పెండింగ్ బిల్లులపై సీఎం నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనకు దిగాలని ఫిబ్రవరి 5న జరిగిన ఏపీ జేఏసీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. అన్ని సమస్యలను చీఫ్ సెక్రటరీకి నివేదించారు. అయినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని వాపోయారు. ఫిబ్రవరి 26న జేఏసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించిన మేరకు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com