ఆపరేషన్‌ మదర్‌ టైగర్‌

ఆపరేషన్‌ మదర్‌ టైగర్‌
గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో ఆచూకి గుర్తించిన అధికారులు

నంద్యాల జిల్లాలో పెద్ద పులి ఆనవాళ్లు లభించాయి. కొత్తపల్లి మండలం ముసలిమడుగు గ్రామ సమీపంలో పెద్దపులి సంచరించినట్టు అధికారులు నిర్ధారించారు. ఆపరేషన్‌ మదర్‌ టైగర్‌ లో భాగంగా పెద్దపులి ఆచూకి గుర్తించారు. ఓ గొర్రెల కాపరి ఇచ్చిన సమాచారంతో... పెద్ద పులి ఆనవాళ్లను నిర్ధారించారు అటవీ అధికారులు. నిన్న సాయంత్రం జొన్న చేను నుంచి రోడ్డు దాటి నీలగిరి చెట్లలోకి వెళ్లినట్టు గుర్తించారు. ఈ ప్రాంతంలో పెద్దపులి పాదముద్ర కనిపించింది. ఆ పాదముద్ర ఆడపులిది అని ప్రాథమికంగా నిర్ధారించారు. మొత్తంగా రెండు చోట్ల కనిపించిన పులి ఆనవాళ్లు టీ-108గా అటవీ అధికారులు భావిస్తున్నారు. నాలుగు పులి పిల్లలను తల్లి వద్దకు చేర్చేంచేందుకు ఆపరేషన్‌ మొదలుపెట్టారు. ఇందుకోసం నల్లమల అడవిలోకి చేరుకున్నారు. డైరెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది. ఆరు వాహనాల కాన్వాయ్‌తో నాలుగు పులిపిల్లలను తీసుకుని పెద్దపులి జాడ కనబడిన ప్రాంతానికి వెళ్లారు. ముసలిమడుగు గ్రామ పొలిమేర నుంచి అడవిలోకి వెళ్లారు. ప్రమాదం ఉంటుందని.. మీడియాను అనుమతించలేదు. నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా సూచనలతో స్టాండింగ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ మొదలుపెట్టారు.

పెద్ద గుమ్మడాపురం శివార్లలోకి నాలుగు పిల్లలతో వచ్చిన తల్లి పులి జాడ రెండు రోజులైనా కానరాలేదు. తల్లి కోసం పులి కూనలు విలవిల్లాడుతున్నాయి. పులి పిల్లలను కలపడం నాగార్జున సాగర్‌ టైగర్‌ రిజర్వ్‌ ఫారెస్ట్ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వారికి జాతీయ పెద్దపులుల సంరక్షణ సాధికారిత సంస్థ నుంచి ఎప్పటికప్పుడు సూచనలు వస్తున్నట్లు తెలుస్తోంది. వీటిని తల్లి చెంతకు చేర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు అటవీ అధికారులు. పులిపిల్లలను అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో క్షేమంగా తల్లి వద్దకు చేరుస్తామంటున్నారు అధికారులు. గత ఏడాది డిసెంబర్‌లో గర్భంతో ఉన్న పులిని ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాల్లో గుర్తించినట్లు తెలిపారు. నాలుగు పిల్లలలకు సరైన రక్షిత ప్రాంతాన్ని వెతుకుతూ గుమ్మడాపురం గ్రామ శివార్లకు తీసుకొచ్చి ఉండవచ్చంటున్నారు. పులి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.

తల్లి నుంచి దూరమై పులిపిల్లలు ఆత్మకూరులోని ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌లో గల ఏసీ గదిలో ఉన్నాయి. వీటికి తిరుపతి శ్రీవెంకటేశ్వర జులాజికల్‌ పార్క్‌ వైల్డ్‌లైఫ్‌ వెటర్నరీ వైద్యులు... వైద్యసేవలు అందిస్తున్నారు. ఇండియాలోనే బెస్ట్‌ వైల్డ్‌లైఫ్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్లచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వీటికి సపర్యలు చేస్తున్నారు. నిన్న వాటికి కావాల్సిన పాలు, కాల్చిన చికెన్‌ లివర్‌ను ఆహారంగా ఉంచారు. కాగా ప్రస్తుతం పులిపిల్లలు ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. పులిపిల్లను తల్లివద్దకు చేర్చే ప్రక్రియలో దాదాపు 350 మంది అటవీ ఉద్యోగులు, సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story