పార్లమెంట్ వేదికగా పోలవరంపై కేంద్రం వేర్వేరు ప్రకటనలు

పోలవరం ప్రాజెక్టు ఎత్తు అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వేర్వేరు ప్రకటనలు చేసింది. 1980 గోదావరి ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం.. పోలవరం పూర్తి నీటినిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లుగా పేర్కొంది. నీటినిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకి తగ్గించాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమ వద్ద సమాచారం లేదని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అయితే, ఇటీవల పార్లమెంటులో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ స్పందిస్తూ.. పోలవరం మొదటి దశలో భాగంగా ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకే పరిమితమని తేల్చి చెప్పారు. దీనికి భిన్నంగా తాజాగా కేంద్రం మరో ప్రకటన చేయడం గమనార్హం.
పోలవరం సవరించిన అంచనాలపైనా రాజ్యసభలో కేంద్రం సమాధానం ఇచ్చింది. సవరించిన అంచనాలపై ఒకే కమిటీ రెండు సిఫారసులు చేసిందని పేర్కొంది. సవరించిన అంచనాలను కేంద్రం చెల్లిస్తుందా? అని ఎంపీ కనకమేడల కేంద్రాన్ని అడిగారు. దీంతో పోలవరం ప్రాజెక్టు పురోగతి నివేదికను కేంద్రం సభముందు ఉంచింది. 2017-18 ధరల మేరకు సవరించిన అంచనా వ్యయం 47వేల 725 కోట్లుగా ఉందన్న కేంద్ర ప్రభుత్వం.. 2019లో తమకు వచ్చిన సవరించిన అంచనా వ్యయం 55వేల 548కోట్లు అని తెలిపింది. వచ్చిన అంచనాలను జలశక్తి శాఖ సాంకేతిక సలహా కమిటీ అంగీకరించిందని చెప్పింది. ఆర్‌సీసీ అధ్యయనంలో అంచనా వ్యయం 47వేల 725 కోట్లుగా నిర్ధారణ అయినట్టు వెల్లడించింది. 2013-14 ప్రకారం అంచనా వ్యయం 29వేల 27 కోట్లుగా పేర్కొన్న కేంద్రం.. భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చు వల్లే ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగిందని తెలిపింది. రాష్ట్రం చేసిన ఖర్చులో ఇప్పటివరకు 13వేల 463కోట్లు ఇచ్చామని స్పష్టంచేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com