అర్హత లేని వారికి పోస్టింగ్‌లు.. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో భారీ అక్రమాలు

అర్హత లేని వారికి పోస్టింగ్‌లు.. డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో భారీ అక్రమాలు
అవినీతి చేసేందుకు అధికారులు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదన్న ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌లో భారీ అక్రమాలు నెలకొన్నాయి. డిపార్ట్మెంట్‌ చేపట్టిన డాక్టర్ రిక్రూట్‌మెంట్‌లో సంచలన అంశాలు బయటపడ్డాయి. పెద్దఎత్తున అక్రమాలు వెలుగు చూశాయి. మెరిట్‌ లిస్ట్‌లో లాస్ట్‌లో ఉన్నవారిని,అర్హత లేని అభ్యర్థులను అనూహ్యంగా పోస్టింగ్‌లు వరించాయి. వైద్యుల కోరతను తీర్చేందుకు ప్రభుత్వం 823 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. అయితే రిజర్వేషన్ల వర్తింపులోనూ డీహెచ్‌లోని కొందరు అధికారులు అడ్డదారులు తొక్కారన్న విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. జోన్లవారీగా చేపట్టాల్సిన నియామకాల్లో ఎక్కడా పర్సంటేజ్‌లు పాటించకుండా ఇష్టారాజ్యం వ్యవహరించారని, అవినీతి చేసేందుకు అధికారులు ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. లక్షల్లో బేరాలు కుదుర్చుకుని.. అతి కీలకమైన వైద్య నియామకాల ప్రక్రియను ఇష్టానుసారం ముగించేశారు. అయితే విషయం బయటకు పొక్కనీయకుండా, లోపల్లోపలే తొక్కిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌లోనే అనుకుంటున్నారట.

మరోవైపు డాక్టర్ల నియామక ప్రక్రియలో తప్పులు జరిగాయని డీహెచ్‌ అధికారులే ఒప్పుకున్నారు.ఈ అంశంపై డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ డాక్టర్‌ రామిరెడ్డి వివరణ ఇచ్చారు. ముగ్గురు అభ్యర్థుల నియామక పత్రాలు రద్దు చేశామన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ చేసేందుకు విచారణాధికారిని నియమించామని, ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా డీఈవోని సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. అయితే సీఎఫ్‌ డబ్యూ, డీహెచ్‌ అధికారులు మాత్రం ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. విచారణాధికారిని నియమించి ఏమీ జరగలేదని, చిన్నచిన్న తప్పులే అంటూ మొత్తం వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేశారు. ఓ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిపై వేటు వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి.

మరోవైపు 2022 జూలైలో డీహెచ్‌ అధికారులు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు వేల మంది వైద్యులు ఈ పోస్టు ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.ఇప్పటి వరకూ 17 సార్లు వైద్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు.గత నెల 25వ తేదీన కూడా 67 పోస్టులను భర్తీ చేశారు.మొన్నటివరకూ ఇదంతా సాఫీగానే సాగుతోందని అందరూ భావించారు. అయితే గత కొన్ని రోజుల క్రితం ఓ డాక్టర్‌ నియామకాల్లో జరుగుతున్న అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు. ఆయన ఫిర్యాదుతో రిక్రూట్‌మెంట్‌ జరిగిన తీరుపై దృష్టి పెట్టారు. అయితే.. అప్పటికే 50మందికి అపాయింట్‌మెంట్‌ లెటర్స్ చేరిపోయాయి. రిజర్వేషన్ల నిబంధనలను తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వాటిని అమలుచేశారని ఉన్నతాధికారుల పరిశీలనలో తేలింది.ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లను కూడా అసలు పట్టించుకోలేదని తేల్చారు.నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్‌ వర్తించదు. ఆగ్రకులాల్లో వెనుకబడిన అభ్యర్థులకే వీటిని అమలుచేయాలి. కానీ, డీహెచ్‌ అధికారులు ఎస్సీ,ఎస్టీ,బీసీ అభ్యర్థులకు కూడా ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు కల్పించారు. ఇలా వారిని మెరిట్‌లో ముందుకు తీసుకువచ్చి పోస్టింగ్‌ అర్డర్లు ఇచ్చేశారు.

Tags

Read MoreRead Less
Next Story