అమరావతి రైతుల జీవితాలతో జగన్ సర్కార్ చెలగాటం

అమరావతి రైతుల జీవితాలతో జగన్ సర్కారు చెలగాటమాడుతోంది. రాజధానేతర పేదలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు కల్పించటంపై కోర్టును ఆశ్రయించిన రైతులకు స్టే రాకపోవటంతో.. అదను చూసుకుని ప్రభుత్వం విరుచుకుపడింది. అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో రాజధానేతర పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ రెడీ అవుతోంది. ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నా నివాస స్థలాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్లను పిలవాలని సీఆర్‌డీఏను నిర్దేశించింది. దీంతో సీఆర్‌డీఏ ఉన్నతాధికారులు ఆగమేఘాల మీద 50 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. సీఎం జగన్ సొంత పత్రికలోనే టెండర్ ప్రకటనను ప్రచురించారు.
నవరత్నాలు- పేదలందరికీ ఇళ్ల కల్పనలో భాగంగా ఆరు పనులకు టెండర్లు పిలిచారు. అవి లెవలింగ్, రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి వసతి, వీధిలైట్లు తదితర పనులుగా తెలుస్తోంది. ఇవాళ ఆ పనులేమిటో వెలుగు చూసే అవకాశం ఉంది. ఇ-ప్రొక్యూర్‌మెంట్ పోర్టల్‌లో ఇవాల్టి నుంచి వివరాలు అందుబాటులో ఉంటాయని ప్రకటించారు సీఆర్డీఏ కమిషనర్. టెండర్లలో పాల్గొనేవారు బిడ్లను సమర్పించటానికి ఈనెల 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువిచ్చారు. అదేరోజు ఆరు గంటలకు టెక్నికల్ బిడ్లను తెరుస్తారు.
ఆర్-5 జోన్‌లో ఎన్టీఆర్, గుంటూరు జిల్లాలకు చెందిన 49 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని CRDA అథారిటీని ఇప్పటికే ఆదేశించారు సీఎం జగన్. అంతకుముందే రహస్యంగా జీవో ఎంఎస్ 45 ద్వారా ఆర్ 5 జోన్ లోని 1134.58 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. దీనిపై రాజధాని రైతులు ఆందోళన చెందారు. తమ నుంచి తీసుకున్న భూముల విషయంలో భూసమీకర ణ ఒప్పందాలు, రాజధాని మాస్టర్ ప్లాన్, సీఆర్‌డీఏ చట్టాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని హైకోర్టును ఆశ్రయించారు. మధ్యంతర ఉత్తర్వులు వస్తాయని రైతులు ఆశించినా.. హైకోర్టు ఇవ్వలేదు. ఈ అంశంపై ఇప్పుడే కల్పించుకోలేమని, అవసరమనుకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. దీంతో రైతులు ఒకింత నిరాశ చెందారు. కోర్టు నిర్ణయాన్ని రైతులు గౌరవించినా.. ప్రభుత్వం మాత్రం కోర్టుల పరిధిలో ఉన్నప్పటికీ అడ్డగోలుగా ముందుకు వెళుతోంది.
రాజధాని విధ్వంసానికి సంబంధించి ప్రభుత్వంపై అనేక కేసులున్నాయి. తుది తీర్పు ద్వారా తమకు న్యాయం జరుగుతుందని అమరావతి రైతులంతా భావిస్తున్నారు. ప్రభుత్వం మూడో విడతగా మేలో ఇళ్ల పట్టాల పంపిణీ అన్నప్పటికీ ఈ లోపే సచివాలయాల ద్వారా పంపిణీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని తెలుస్తోంది. మే వరకు సమయం ఉందన్న వదంతులను వ్యాప్తి చేయటం ద్వారా చాపకింద నీరు లా పని కానిచ్చేయాలన్నది ప్రభుత్వ వ్యూహంగా అనుమానిస్తుననారు రాజధాని రైతులు. ఒక్కసారి ఇళ్ల పట్టాలు లబ్ధిదారుల చేతికందితే ఇక చేసేదేమీ ఉండదని ఆందోళన చెందుతున్నారు. దీంతో మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు రెడీ అవుతున్నారు అమరావతి రైతులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com