గరంగరంగా విజయనగరం అధికార పార్టీ రాజకీయాలు

గరంగరంగా విజయనగరం అధికార పార్టీ రాజకీయాలు
ఒకరి స్థానం కోసం మరొకరు పోటీ పడుతుండటంతో అభద్రతా భావం, ప్రధాన కారణం పార్టీని ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షుడే

విజయనగరం జిల్లా అధికార పార్టీలో రాజకీయాలు హాట్ హాట్ గా ఉన్నాయట. ఎన్నికలకు ఏడాది సమయమున్నా...టికెట్ల కోసం ఇప్పటి నుండే పోటీ పడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒకరి స్థానం కోసం మరొకరు పోటీ పడుతుండటంతో ఎవరికి వారు అభద్రతా భావానికి లోనవుతున్నారట. దీనికి ప్రధాన కారణం పార్టీని ముందుండి నడిపించాల్సిన జిల్లా అధ్యక్షుడే కావడంతో ఇద్దరు ఎమ్మెల్యేలు ఇబ్బందులు పడుతున్నారట. మేనమామ బొత్స సత్యనారాయణ అండతో గత రెండు దశాబ్దాలుగా మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను ఓ వెలుగు వెలిగారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ ..జిల్లా నాయకత్వం నుండి రాష్ట్ర నాయకత్వానికి ఎదిగే సమయంలో తన బాధ్యతలను మేనల్లుడు చిన్న శ్రీనుకు అప్పజెప్పారట. దీంతో జిల్లాలోని పార్టీ పరిస్థితులు గాని, కార్యకర్తల కష్టనష్టాలు గాని చిన్న శ్రీను చూసుకునేవారు. అప్పటి నుండి 2019 ఎన్నికల వరకు షాడో నేతగా ఉంటూ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలపై మంచి పట్టు సాధించారట. అదే సమయంలో కష్టాల్లో ఉన్న కార్యకర్తలను ఆదుకుంటూ జిల్లా వ్యాప్తంగా తన మాట చెల్లుబాటు అయ్యేలా వ్యవహారించారట.

ఈ నేపథ్యంలో జిల్లాలోని శృంగవరపుకోట, బొబ్బిలిలో మాత్రం దృష్టి సారించిన చిన్న శ్రీను తమ పార్టీ నాయకులకు గాని, కార్యకర్తలకు గాని ఎలాంటి కష్టం వచ్చినా తీర్చేవారని కార్యకర్తలు చెప్పుకుంటున్నారట. వాస్తవానికి 2019 ఎన్నికలు వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టని వ్యక్తి 2021 లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో మెరకముడిదాం మండలం నుండి వైసీపీ తరపున విజయం సాధించి జిల్లా పరిషత్ ఛైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షుడిగానూ బాధ్యతలనూ పార్టీ కట్టబెట్టింది. అయితే ప్రస్తుత ఎమ్మెల్యేల పని తీరుతో పార్టీ అధిష్ఠానం విసుగు చెందినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న చిన్న శ్రీనును 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే గా బరిలో దింపేందుకు వైసీపి అధిష్టానం కసరత్తు చేస్తోందట. దీనికి తోడు చిన్న శ్రీను కూడా శాసనసభలో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారట. వాస్తవానికి మేనమామ బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆశించారట. కానీ 2024 లో కూడా బొత్సనే పోటీ చేయనుండటంతో అవకాశం లేకుండా పోయిందట. దీంతో శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు చిన్న శ్రీను ఆసక్తి చూపిస్తున్నారట.

జిల్లా పరిషత్ చైర్మన్ గా , జిల్లా అధ్యక్షుడుగా ఉన్న చిన్న శ్రీను చేస్తున్న ప్రయత్నాలతో శృంగవరపుకోట, బొబ్బిలి నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. ఉన్న పళంగా తమ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడే రానుండటంతో జీర్ణించుకోలేక పోతున్నారట సదరు ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాస్, సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడు. అంతేకాదు వెలమ సామాజిక వర్గానికి చెందిన నియోజకవర్గాలపై కాపు నేత కన్ను ఏంటని ప్రశ్నిస్తున్నారట. నియోజకవర్గాలను త్యాగం చేయాల్సి వస్తే అధిష్ఠానం వద్దే అమీ తుమీ తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారట ఎమ్మెల్యేలు కడుబండి శ్రీనివాస్, సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడులు. అయితే చిన్న శ్రీను మాత్రం ఇప్పటికే ఆ రెండు నియోజకవర్గాల్లో ఉన్న సగం క్యాడర్ ను తన వైపు తిప్పుకున్నారట. తద్వారా ఆ రెండు నియోజకవర్గాలోని ఎమ్మెల్యేలకు తన అనుచరులు చేత వ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తున్నారనే టాక్ బలంగా వినిపిస్తోందట. ఇందులో భాగంగానే శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు పని చేస్తుండటంతో నియోజకవర్గంలో ఉన్న కొన్ని మండలాల నాయకులు పట్టించుకోవడంలేదని ప్రచారం జరుగుతోంది. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డిని కలిసి నియోజకవర్గంలోని అయిదు మండలాలకు చెందిన సుమారు 100మంది నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తమ గోడును వెళ్లబోసుకున్నారట. పార్టీ అంటే అభిమానమని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకి టికెట్ ఇవ్వవద్దని, ఇస్తే ఓడించి తీరుతామని నేతలు హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. వలస నేతకు పట్టం కడితే తమనే నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారట. కొత్తవలస మండలంలో భూ కుంభకోణాల్లో ఎమ్మెల్యే మునిగి పోయారని ఎల్.కోట మండలానికి చెందిన కూరాకుల సూర్యారావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసినట్లు వినికిడి. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని సుబ్బారెడ్డి హామీ ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పలనాయుడుకు వ్యతిరేకంగా మున్సిపల్ కౌన్సిలర్లు అసమ్మతి గళం వినిపిస్తున్నారట. తమ వార్డుల్లో అభివృద్ధి జరగడం లేదని, మున్సిపాలిటీలో అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడు మున్సిపల్ ఛైర్మన్ సావు మురళి కృష్ణను పదవి నుండి తొలగించాలని బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారట. వచ్చే ఎన్నికలనాటికి కడుబండి శ్రీనివాసరావుకు వయోభారం ఉందంటూ కావాలనే నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం చేయిస్తున్నారని సదరు ఎమ్మెల్యే ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం.

ఎలా అయినా ఈ సారి అసెంబ్లీలో అడుగుపెట్టాలని జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ప్రయత్నాలు చేస్తుంటే ఆ ప్రయత్నాలను తిప్పి కొట్టే పనిలో ఉన్నారు ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు. అయితే ఈ రాజకీయ చదరంగంలో నిలబడేదెవరు, తడబడేది ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags

Read MoreRead Less
Next Story