Crime : క్లైమాక్స్‌కు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

Crime : క్లైమాక్స్‌కు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. వివేకా మర్డర్‌ కేసులో అరెస్ట్ అయిన ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ కీలక అంశాలు వెల్లడించింది. వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ఆధారాల చెరిపివేతకు గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారని తెలిపింది. వివేకా హత్య రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్ తన ఇంట్లో నుంచి బయటికెళ్లాడని వెల్లడించింది. వివేకా హత్య స్థలంలో ఆధారాలను ఉదయ్ చెరిపేశారనేందుకు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పింది. హత్య రోజు తెల్లవారుజామున ఆవినాష్‌రెడ్డి ఇంట్లోనే ఉదయ్, శివశంకర్‌రెడ్డి ఉన్నారని రిమాండ్‌ రిపోర్టులో వెల్లడించింది. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారని సీబీఐ స్పష్టంచేసింది. విచారణకు ఉదయ్‌కుమార్‌రెడ్డి సహకరించట్లేదని.. పారిపోతాడనే ఉద్దేశ్యంతోనే ఉదయ్‌ను అరెస్టు చేశామని తెలిపింది. కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని.. వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారని సీబీఐ పేర్కొంది.

వివేకానందరెడ్డి హత్య రోజు.. తర్వాత ఏంజరిగిందనే అంశాలను ఆధారాలతో సహా ఉదయ్‌కుమార్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో బయటపెట్టింది సీబీఐ. ఉదయ్, శివశంకర్ రెడ్డి, అవినాష్‌రెడ్డి ఘటనా స్థలంలో ఆధారాలు తారుమారు చేశారని పేర్కొంది. హత్య తర్వాత అవినాష్ రెడ్డి ఇంటికి ఉదయ్ వెళ్లాడని.. గూగుల్ టెక్ ఔట్ లొకేషన్‌లో కూడా అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉదయ్ ఉన్నట్లు తేలిందని తెలిపింది సీబీఐ. తన తండ్రి ప్రకాష్‌రెడ్డితో వివేకా మృతదేహానికి కుట్లు వేయించారని వెల్లడించింది. అవినాష్‌రెడ్డికి ఉదయ్‌కుమార్‌రెడ్డి అత్యంత సన్నిహితంగా ఉంటున్నాడని.. వివేకా చనిపోయాడు అని తెలిసే వరకు వారు ఇంట్లోనే ఉన్నారని పేర్కొంది. వివేకా మృతి చెందాడని వార్త తెలియగానే.. అవినాష్‌రెడ్డి, ఉదయ్‌కుమార్ రెడ్డి, శివశంకర్ ఘటనా స్థలానికి వెళ్లారని స్పష్టంచేసింది. వివేకా డెడ్‌బాడీని బాత్రూం నుండి బెడ్‌రూమ్‌కి ఉదయ్ తీసుకువచ్చాడని తెలిపింది. వివేకా తలకున్న గాయాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారని.. గుండెపోటు అని చిత్రీకరించడంలో వీరి పాత్ర చాలా కీలకంగా ఉందని పేర్కొంది. గాయాలు కనపడకుండా ఉండేందుకు ఉదయ్‌కుమార్‌రెడ్డి తన తండ్రిని సంప్రదించి కుట్లు వేయించారన్న సీబీఐ.. చనిపోయిన వివేకా తలకు ప్రకాశ్ రెడ్డి బ్యాండేజ్ వేశాడని సంచలన విషయాలను బయటపెట్టింది.

Tags

Next Story