కడపలో కామూష్‌.. వైసీపీ కేడర్‌లో కలవరం

కడపలో కామూష్‌.. వైసీపీ కేడర్‌లో కలవరం
భాస్కర్‌ రెడ్డి అరెస్ట్ పై కడప జిల్లాలో పెద్దగా స్పందన కనిపించలేదు

భాస్కర్‌ రెడ్డి అరెస్ట్ పై కడప జిల్లాలో పెద్దగా స్పందన కనిపించలేదు. కేడర్‌లో ఎలాంటి రెస్పాన్స్‌ లేకపోవడం పార్టీ హైకమాండ్‌తో పాటు అ్రగశ్రేణి నేతల్లో కలవరం మొదలైంది. హత్య కేసులో అరెస్టులు సీఎం జగన్‌ కుటుంబ సభ్యుల వరకు రావని వారి బంధువులు, అనుచరులు గట్టి విశ్వాసంతో ఉంటూ వచ్చారు. అయితే ఎంపీ అవినాష్‌రెడ్డి కూడా తన తండ్రిని అరెస్టు చేస్తారని ఊహించలేదని స్థానిక నేతలు అంటున్నారు. సీబీఐ సిట్ బృందం అనూహ్యంగా వైఎస్‌ భాస్కరరెడ్డిని అరెస్టు చేయడంతో వైఎస్‌ బంధువులు షాక్‌ తిన్నారు. ప్రజల నుంచి దీనికి ఎలాంటి స్పందన లేకపోవడం పార్టీని మరింతగా కలవరపరస్తోంది.

భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ తరవాత పులివెందుల బంద్‌కు స్థానిక వైసీపీ నేతలు పిలుపు ఇచ్చారు. కొందరు నేతలు బలవంతంగా షాపులు మూయించే ప్రయత్నం చేశారు. అయితే అరగంటలోనే పరిస్థితి మళ్ళీ మామూలుగా మారింది. దీంతో ఇక జిల్లాలో కూడా భాస్కర్‌ రెడ్డి అరెస్ట్‌ గురించి ఎవరూ పట్టించుకోలేదు. కడపలో చేపట్టిన శాంతియుత నిరసన ప్రదర్శనకు అధికార పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు, నాయకులు హాజరు కాకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. కడపలో వైసీపీకు 49 మంది కార్పొరేటర్లు, అయిదుగురు కోఆప్షన్‌ సభ్యులున్నారు. కానీ నిన్న జరిగిన నిరసన ర్యాలీలో సుమారు 15 మంది కార్పొరేటర్లు మాత్రమే పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story