అవినాష్‌ రెడ్డికి హైకోర్టులో వారం రోజులు ఊరట

అవినాష్‌ రెడ్డికి హైకోర్టులో వారం రోజులు ఊరట

వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డికి హైకోర్టులో వారం రోజులు ఊరట లభించింది.. ఈనెల 25 వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 25 తర్వాత ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పు ఇస్తామని చెప్పింది.. అయితే, ఇప్పటికే వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిని ఆరు రోజుల కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. వారిద్దరితో కలిపి అవినాష్‌ రెడ్డిని ప్రశ్నిస్తామని సీబీఐ కోర్టుకు తెలిపింది.

వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు ఈనెల 25 తర్వాత తీర్పును వెలువరించనుంది. అదే సమయంలో ఈనెల 25వ తేదీ వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐ అధికారులకు సూచించింది. అప్పటి వరకు అవినాష్‌రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి క్లియర్‌ ఇన్‌స్ట్రక్షన్స్‌ ఇచ్చింది. సీబీఐ పిలిచినప్పుడల్లా అవినాష్‌ విచారణకు వెళ్లాలని సూచించింది. విచారణను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని సీబీఐ అధికారులను ఆదేశించింది. ఆ ఫుటేజ్‌ను హైకోర్టుకు సమర్పించాలని.. ఆ తర్వాతే తుది తీర్పు వెలువరిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. అటు అవినాష్‌ రెడ్డిని బుధవారం విచారిస్తామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీబీఐ, సునీత, అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాదులు ఎవరి వాదనలు వారు వినిపించారు. వివేకా చేతిపై ఏ2 గొడ్డలిలో నరికాడని చెబుతున్నారని.. నరికిన తర్వాత ఆయన లెటర్‌ ఎలా రాశాడో దానిపై సీబీఐ స్పష్టత ఇవ్వలేదని అవినాష్‌ లాయర్‌ వాదించారు. అయితే, వివేకా చేతిపై తలపై కూడా గాయాలు ఉన్నాయా అని న్యాయమూర్తి అడగ్గా.. చేతిపై, తలపైనే కాదు చాలా చోట్ల గొడ్డలితో నరికిన గాయాలు ఉన్నాయని అవినాష్‌ లాయర్‌ చెప్పారు.. అలాంటప్పుడు అది గుండెపోటు అని ఎలా చెప్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు.. వేరే వాళ్లు చెప్పడం వల్ల అవినాష్‌ అలా అనుకున్నాడని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.. అటు అవినాష్‌ రెడ్డి ప్రధాన సూత్రధారి అని తాము అనుకుంటున్నామని సీబీఐ న్యాయవాది కోర్టుకు చెప్పారు. 14-15 మధ్య హత్య జరగడం.. 17న అవినాష్‌ టికెట్‌ కన్ఫామ్‌ కావడం.. 21న నామినేషన్‌ వేయడం.. ఇవన్నీ అనుమానాలకు తావిస్తున్నాయని.. వీటన్నిటిపైనా విచారించాలని సీబీఐ న్యాయవాది వాదించారు.. వివేకా బెంగళూరు ఆర్థిక లావాదేవీలు, వివాదాలపైనే విచారణ జరిపామన్నారు.. ఆయనపై వస్తున్న అక్రమ సంబంధం ఆరోపణలపైనా విచారణ జరిపామన్నారు.. ఈ రెండు హత్యకు కారణాలు అని మాకు ఎలాంటి ఆధారాలు దొరకలేదని సీబీఐ న్యాయవాది వాదించారు.

ఇక బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా అవినాష్‌ రెడ్డి లాయర్‌కి, సునీత తరపు న్యాయవాదికి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.. రాజకీయ కారణాలతోనే కేసులో ఇరికిస్తున్నారని అవినాష్‌ రెడ్డి లాయర్‌ ఆరోపించగా.. ఆ వాదనలను సునీత తరపు న్యాయవాది ఖండించారు.. దస్తగిరిని సునీత న్యాయవాది సమర్థిస్తున్నాడని.. ఆయన తరపున వకాల్తా పుచ్చుకున్నాడో ఏమో అంటూ అవినాష్‌ రెడ్డి లాయర్‌ వాదించారు.. వెంటనే కలుగజేసుకుని సునీత తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు.

అంతకు ముందు ఈ కేసులో ఇంప్లీడ్‌ అయిన సునీత తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.. గంగాధర్‌ రెడ్డి 161 స్టేట్మెంట్‌లో శివ శంకర్‌ రెడ్డి సన్నిహితుడుగా చెప్పారని కోర్టుకు వివరించారు. అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కుటుంబం ప్రమేయం లేకుండా హత్య చేసే అవకాశమే లేదని శివశంకర్‌ రెడ్డి చెప్పిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. కేవలం దస్తగిరి స్టేట్మెంట్‌ మాత్రమే కాదు.. గంగాధర్‌ రెడ్డి స్టేట్మెంట్‌ కూడా అవినాష్ ప్రమేయం చూపెడుతోందని అన్నారు.. రంగయ్య స్టేట్మెంట్‌ ప్రకారం వివేకా డెడ్‌ బాడీ ఉన్న గదిలోకి ఒకరిద్దరు పని వాళ్లను తప్ప ఎవరినీ రానివ్వలేదన్నారు.. గదికి కాపలాగా భాస్కర్‌ రెడ్డి ఉన్నారని.. అవినాష్‌ మాత్రం లోపలికి వెళ్లి వచ్చాడని సునీత తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. హత్య జరిగిన తర్వాత ముందుగా అవినాష్ రెడ్డి, శంకర్ రెడ్డి వచ్చారని కోర్టుకు తెలిపారు. తర్వాత భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరు వచ్చారన్నారు. సాక్ష్యాలు తుడిచేసేందుకు ఇద్దరు పనిమనుషులను వీళ్లే పురమాయించారని కోర్టుకు వివరించారు. గుండెపోటుతో చనిపోయాడనే కాన్సెప్ట్ వాళ్లే రచించారన్నారు.. గూగుల్‌ టేకవుట్‌ సాక్ష్యాలు సరిపోతాయా లేదా అనేది విచారణ ఈదశలో ఉన్నప్పుడు నిందితుడు తేల్చడమేంటన్నారు.. వీటన్నిటినీ సరైన సమయంలో కోర్టులో పరిశీలిస్తాయన్నారు.

అంతేకాదు, గతంలో అవినాష్‌ వేసిన రిట్‌ పిటిషన్‌లో కూడా రిసీవ్‌ స్టెప్స్‌ తీసుకోవద్దని ఆదేశించమని కోర్టును కోరిన విషయాన్ని సునీత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. విచారణను అడ్డుకోవడానికే ఆయన ప్రతిసారి ప్రయత్నిస్తున్నారని వాదించారు.. అవినాష్‌ రెడ్డి వాదనల్లో సునీతకు, ఆమె తండ్రికి మనస్పర్థలు ఉన్నాయని చెప్పారని.. అదంతా అబద్ధమని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. సునీతతో ఆమె తండ్రికి ఎలాంటి మనస్పర్ధలు లేవని అన్నారు.. విచారణ కీలక దశలో ఉన్నప్పుడు అత్యంత పలుకుబడి కలిగిన అవినాష్‌కు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అవుతాయని.. సుప్రీంకోర్టు కూడా ఈ అంశాలను పరిశీలించిన తర్వాతే కేసును తెలంగాణకు బదిలీ చేసిందని సునీత తరపు న్యాయవాదులు వాదించారు.

అంతకు ముందు ఈ కేసులో సీబీఐ తరపు న్యాయవాదులు వాదించారు.. ఏ2 దగ్గర హత్యకు ఉపయోగించిన ఆయుధం రికవరీ చేసేందుకు ప్రయత్నించామని కోర్టుకు తెలిపారు.. హత్య జరగగానే ఏ2 సునీల్‌ యాదవ్ అవినాష్‌ ఇంటికి వెళ్లాడని.. ఈ వ్యవహారంలో నాలుగు కోట్లు చేతులు మారినట్లు విచారణలో తేలిందని వాదించారు. ఇక ఆరో నిందితుడు ఉదయ్‌కుమార్‌ హత్యకు ముందు, తర్వాత అవినాష్‌రెడ్డి ఇంటికి వెళ్లాడని.. ఆయన తండ్రి జయప్రకాష్‌రెడ్డి వివేకా మృతదేహానికి బ్యాండేజ్ వేశాడని.. వీటిపై అవినాష్‌రెడ్డిని విచారించాల్సి ఉందని సీబీఐ న్యాయవాదులు వాదించారు.. గతంలో వీటికి అవినాష్‌రెడ్డి సమాధానం చెప్పలేదన్నారు. ఈ అన్ని విషయాలపై అవినాష్‌ రెడ్డిని విచారించాల్సి ఉందని, ఇంతకు ముందు విచారణలో వీటికి సమాధానం చెప్పలేదని సీబీఐ లాయర్లు తమ వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు విన్న హైకోర్టు.. బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును ఈనెల 25 తర్వాత వెల్లడిస్తామని చెప్పింది.

Read MoreRead Less
Next Story