ఏపీలో పన్నుపోటు.. గగ్గోలు పెట్టుకుంటున్న పట్టణ ప్రజలు

ఏపీలో ఏటా 10-15శాతం చొప్పున ఆస్తి పన్ను పెంపుతో పట్టణ ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆస్తి మూల ధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం 2021-22 నుంచి అమల్లోకి రాగా, గత మూడేళ్లలో ప్రజలపై 659.55 కోట్ల అదనపు భారం పడింది. పుర, నగరపాలక సంస్థల్లో, నగర పంచాయతీల్లో పన్ను చెల్లింపుదారులు, ప్రజాసంఘాలు కొత్త విధానాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వం అమలు చేసింది. పాత విధానంలో వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన 2020-21లో విశాఖలోని సీతమ్మధారలో 950 చదరపు అడుగుల విస్తీర్ణంలోని ఫ్లాట్‌కు దాని యజమాని 3వేల 834రూపాయలు పన్ను చెల్లించేవారు.
కొత్త విధానం వచ్చాక 2021-22లో ఇది 4వేల 410కి పెరిగింది. 2022-23లో 5వేల 72కు పెరగ్గా, 2023-24లో 5వేల 534కి చేరినట్లు నగరపాలక సంస్థ ఆన్‌లైన్‌లో డిమాండ్ నోటీస్ అప్‌లోడ్ చేసింది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ల శాఖలోని స్ట్రక్చరల్, భూముల విలువ ప్రకారం ఫ్లాట్ విలువ 38.80 లక్షలుగా నగరపాలక సంస్థ నిర్ణయించింది. దీనిపై 0.13శాతంగా నిర్ణయించిన ఆస్తి పన్ను మొత్తంపై.. లైబ్రరీ సెస్సు, ఇతర రుసుముల కింద మరో 8శాతంతో కలిపి వార్షిక పన్ను 10వేల896గా లెక్కకట్టింది. పెరిగిన మొత్తం ఒకేసారి అమలు చేయడంతో ప్రజలకు భారమవుతుందని ఏటా 10శాతం అదనంగా పెంచుతున్నారు. పొరుగున తెలంగాణలో ఆస్తి మూలధన విలువ ఆధారంగా పన్ను విధించే విధానం లేదు. వార్షిక అద్దె విలువ ప్రాతిపదికన పన్నులు విధిస్తున్నందున, అక్కడి పట్టణవాసులపై అదనపు పన్ను బాదుడు లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com