పేదలే టార్గెట్.. పుట్నాల్లా కిడ్నీలు అమ్మేస్తున్నారు

పేదలే టార్గెట్.. పుట్నాల్లా కిడ్నీలు అమ్మేస్తున్నారు
పేదల ఆర్థిక అవసరాలే పెట్టుబడిగా సాగిన నయా మోసాని బాధితులే బయటపెట్టారు

విశాఖలో కిడ్నీ మాఫియా పడగ విప్పింది. మధురవాడ కేంద్రంగా సాగిన కిడ్నీ దందా బట్టబయలైంది. పేదల ఆర్థిక అవసరాలే పెట్టుబడిగా సాగిన నయా మోసాని బాధితులే బయటపెట్టారు. లక్షల రూపాయలు ఆశచూపి కిడ్నీని ఎలా కాజేశారు? వారిని ఎలా మోసం చేసారో బాధిత కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. డిసెంబర్‌లో జరిగిన కిడ్నీ రాకెట్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఇపుడు ఏపీలో దుమారం రేపుతోంది.

మధురవాడకు చెందిన వినయ్ కుమార్‌కు కిడ్నీ గ్యాంగ్, దళారులు ఎలన్, శ్రీను, కామరాజు వల వేశారు. మాయమాటలతో మచ్చిక చేసుకున్నారు. కిడ్నీ ఇస్తే ఎనిమిదిన్నర లక్షల రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. తమ కుటుంబ పరిస్థితులు బాగో లేకపోవడంతో వారి మాటలు నమ్మిన వినయ్‌.. ఇంట్లో వారికి తెలియకుండానే అందుకు అంగీకరించాడు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ సమీపంలో విజయ మెడికల్ ల్యాబ్‌లో వినయ్‌కు వైద్య పరీక్షలు చేయించాడు కామరాజు. అయితే వైద్య పరీక్షల అనంతరం భయపడి హైదరాబాద్‌లో ఉంటున్న తమ బంధువుల ఇంటికి వినయ్‌ వెళ్లిపోయాడు. అయితే కిడ్నీ ముఠా అతని కోసం అన్వేషించారు. చివరికి వినయ్.. హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. వినయ్ బంధువుల ఇంటికి వెళ్లి.. అతడిని మళ్లీ విశాఖకు తీసుకొచ్చారు కామరాజు, ఎలన్, శ్రీను. నేరుగా పెందుర్తి పరిధిలో ఉన్న తిరుమల హాస్పిటల్‌కి వినయ్ కుమార్‌ను కామరాజు గ్యాంగ్ తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు అతడి కిడ్నీని తొలగించారు.

కిడ్నీకి ఎనిమిదిన్నర లక్షలు ఇస్తామంటూ ఆశ చూపిన కామరాజు ముఠా ఇవ్వలేదు. ఐదు లక్షలు ఇస్తామని చెప్పి చివరికి రెండున్నర లక్షలు ఇచ్చి సరిపెట్టారు. బాధితుడు వినయ్ తండ్రికి డబ్బులు ఇస్తున్న కిడ్నీ గ్యాంగ్ దృశ్యాలు వైరల్‌గా మారాయి. దాంతో తాను మోసపోయానని తెలుసుకున్న వినయ్‌కుమార్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు తిరుమల ఆస్పత్రికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అయితే అప్పటికే కిడ్నీ ముఠా, దళారులు ఎలన్, శ్రీను, కామరాజు అడ్రస్ లేకండా పారిపోయారు. కిడ్నీ తీసిన వైద్యులు పత్తా లేకుండా పోయారు. గత రెండ్రోజులుగా తిరుమల హాస్పిటల్‌ మూసివేశారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. కొడుకు కిడ్నీ ఇచ్చిన సంగతి తల్లిదండ్రులకు తెలియదు. తెలిసేలోపు.. అంతా జరిగిపోయింది. ప్రస్తుతం కదల్లేని పరిస్థితుల్లో ఉన్న బాధితుడు వినయ్‌, అతని కుటుంబం ఆదుకోవాలంటూ కన్నీరుమున్నీరవుతున్నారు. మాయమాటలతో కిడ్నీ కాజేయడమే కాకుండా.. ఎరగా చూపిన డబ్బు ఇవ్వకుండా తమను మరో మోసం చేసారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు బాధితుకి మద్దుతుగా అతని ఇంటి బయట ఆందోళనకు దిగిన స్థానికులు.. వినయ్‌కు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story