AP : "జగన్‌ను నమ్ముకున్న కార్యకర్తలు బజారున పడ్డారు"

తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్‌ను నమ్ముతున్న వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందన్నారు. జగన్‌ను నమ్ముకున్న కార్యకర్తలు బజారున పడ్డారన్నారు. వైసీపీని అధికారంలోకి తీసుకువచ్చిన కార్యకర్తలను విస్మరిస్తే నాశనమవుతారని శాపనార్తాలు పెట్టారు. మండలాల్లో పనిచేస్తున్న అధికారులు నియంతల్లా ప్రవర్తిస్తున్నారని.. గ్రామాల్లో కక్షలు, కార్పణ్యాలకు అధికారులే కారణమని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదు... కార్యకర్తలను రక్షించుకోవడమే తన మొదటి ప్రాధాన్యత అన్నారు పెద్దారెడ్డి. యల్లనూరు మండలంలో ఆటవిక రాజ్యం నడుస్తోందని... అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో.. తమ కార్యకర్తలకే న్యాయం జరగలేని పరిస్థితి ఉందన్నారు. ఒక దళిత మహిళ ఎంపీపీ అయితే పరిగణనలోకి తీసుకొని పరిస్థితి ఉందంటూ.. దళిత మహిళ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలోని దళితులకు ప్రాధాన్యత లేదంటూ.. సింగనమల ఎమ్మెల్యే పద్మావతిపై పెద్దారెడ్డి పరోక్ష విమర్శలు చేశారు. సీఎం సభలో దళితులకు ప్రాధాన్యత ఇవ్వలేదనే ఆరోపణల నేపథ్యంలో.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.
అంతకుముందు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి యల్లనూరు పోలీస్ స్టేషన్‌లో ఆందోళనకు దిగారు. తన వర్గీయులపై 307 సెక్షన్, బోగతి నారాయణ రెడ్డి వర్గీయులపై 324 సెక్షన్ కింద కేసు పెట్టారంటూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆందోళన విరమించాలని తాడిపత్రి డీఎస్పీ చైతన్య నచ్చచెప్పారు. తాను ఎమ్మెల్యేగా ఉండి కూడా తన వర్గీయులపై హత్యాయత్నం కేసు నమోదు చేస్తుంటే చూస్తూ కూర్చోవాలా అంటూ పోలీసులపై పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పీఎస్ నుంచి వెళ్లిపోయారు.
రెండ్రోజుల కిందట వైసీపీలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. తాడిపత్రి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ బోగతి నారాయణరెడ్డి.. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు.. పరస్పరం వేట కొడవళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దశాబ్దాలుగా పెద్దారెడ్డి, బోగతి నారాయణ రెడ్డి వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com