NTR శతజయంతి ఉత్సవాలకు రజినీకాంత్

ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభకు సర్వం సిద్ధమైంది. ఈ సభలో పాల్గొనేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో రజనీకాంత్‌కు నందమూరి బాలకృష్ణ స్వాగతం పలికారు. బాలయ్యను రజనీకాంత్ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఎలా ఉన్నారంటూ పరస్పరం ఇద్దరూ పలకరించుకున్నారు. గన్నవరం నుంచి ఒకే కారులో రజనీకాంత్-బాలయ్య విజయవాడలోని నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం వచ్చినందుకు బాలకృత్య ప్రత్యేకంగా రజనీకాంత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఐతే.. అన్నగారి కార్యక్రమానికి రాకుండా ఉండగలనా అంటూ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. రజనీకాంత్‌తో కాసేపు హోటల్‌లో బాలయ్య సమావేశమయ్యారు.
విజయవాడలో ఇవాళ స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా నెల రోజులు వంద ప్రాంతాల్లో 100 వేడుకలు నిర్వహించాలని ప్రణాళిక రూపొందించారు. ఇక ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు, ప్రజలను చైతన్య పరుస్తూ..వివిధ వేదికలపై చేసిన ప్రసంగాలతో పుస్తకాలు ఈ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొంటారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com