విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా లారీల బంద్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు ప్రకటించారు. అఖిలపక్ష రైతు సంఘాల సమన్వయ సమితి పిలుపు మేరకు విశాఖ ఉక్కు కార్మికుల పోరాటానికి సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి లారీలను ఎక్కడికక్కడే నిలుపుదల చేయాలని లారీ యజమానులకు పిలుపునిచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో 32 మంది తెలుగు ప్రజల బలిదానంతో పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించటం బాధాకరమన్నారు. కేంద్రం ప్రభుత్వ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఉక్కు ఫ్యాక్టరీ కార్మిక వర్గం 800 రోజులుగా మొక్కవోని దీక్షతో పోరాటం సాగిస్తోందని తెలిపారు. ఉక్కు ఫ్యాక్టరీ కార్మికులకు రాష్ట్ర ప్రజానీకం అండగా ఉందన్నారు. రైతులు ఇచ్చిన 22 వేల ఎకరాల్లో నిర్మించిన ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవటం మనందరి బాధ్యతని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com