AP : ఏపీలో రైతుల కష్టాలు.. ఎక్కడ చూసినా నీళ్లలో నానుతున్న ధాన్యం

AP : ఏపీలో రైతుల కష్టాలు.. ఎక్కడ చూసినా నీళ్లలో నానుతున్న ధాన్యం

అకాల వర్షాలతో ఏపీలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. వానలు, గాలులతో.. కోతకు సిద్ధంగా ఉన్న పంట నీటిపాలైంది. కొన్నిచోట్ల మొలకలు వస్తున్నాయి. యంత్రాలతో కోయించాలన్నా.. నీరు నిలవడంతో పొలంలోకి దిగే పరిస్థితి లేదు. నూర్పిడి చేయించిన ధాన్యాన్ని రోడ్లమీద ఆరబోస్తే.. వానకు తడిసింది. వానలు ఆగకపోవడంతో.. కుప్పలుగా పోసిన ధాన్యం కింద కూడా నీరు చేరింది. రాజుల సొమ్ము రాళ్లపాలు... రైతుల కష్టం నీటిపాలు. అకాల వర్షానికి అన్నదాతలు నిండా మునిగారు. అకాల రైతుల పాలిట శాపంగా మారాయి. ఎక్కడ చూసినా నీళ్లలో నానుతున్న ధాన్యాన్ని చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. అయితే ఆదుకోవాల్సిన సర్కార్‌ మాత్రం మొద్దు నిద్ర వదడం లేదు.

విపత్తులు సంభవించినప్పుడు నష్టపోయిన రైతులకు ఇవ్వాల్సిన వెయ్యి కోట్లను కూడా ఏపీ ప్రభుత్వం మళ్లించేసింది. రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ వేరు.. విపత్తలు వచ్చినప్పుడు చేసే సాయం వేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడనే విపత్తుల సాయం కింద ప్రకటిస్తోంది. సర్కార్‌ నుంచి ఇప్పటి వరకూ పంట నష్టపరిహారంపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.కనీసం మంత్రులు, ఎమ్మెల్యేలు రైతులకు భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టకపోవడం దారుణమన్న విమర్శులు వస్తున్నాయి.

సాగుచేసిన పంటల్లో ఎక్కువ శాతం కోతలు పూర్తయ్యాయి. రైతుల చేతికి పంట వచ్చిన దశలో వర్షాలు విరుచుకుపడ్డాయి. మిరప, మొక్కజొన్న, పసుపు, మినుము తదితర పంటలన్నీకల్లాల్లోనే ఉన్నాయి. విడవకుండా కురుస్తున్న వానలతో.. ఇవన్నీ తడవడంతో రైతులు పెద్దఎత్తున నష్టపోయారు. అమ్ముకోవాలన్నా కొనే నాథుడు లేరు.మామిడిలోనూ కాపు రాలిపోయింది. పంట కోసిన తర్వాత సంభవించే నష్టానికి సాయం అందించలేమని, నిబంధనలు వర్తించవని అధికారులు అంటున్నారు. అంటే కల్లాల్లో ఆరబెట్టిన పంట దెబ్బతిన్న రైతులందరికీ తీవ్రనష్టం. ప్రభుత్వం నుంచి సాయం అందే పరిస్థితి లేదు.

ఏపీలో ఎక్కువ మంది కౌలు రైతులే. గోదావరి జిల్లాల్లో 90శాతం వరకు కౌలు రైతులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా నష్టాల నేపథ్యంలో కొందరు ఖరీఫ్‌ సాగు చేయలేక.. రబీలోనే నాట్లు వేశారు. తీరా పంట చేతికి వచ్చే సమయంలో వానలు కురవడంతో వారికి నష్టాలే మిగిలాయి. ఎకరాకు 35 వేలకు పైగా పెట్టుబడులు పెట్టి సాగుచేసినా అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయామని పర్యంతమవుతున్నారు. ధాన్యం బాగుంటేనే.. బస్తాకు 1 వేయి 350 దక్కుతుంది. మద్దతు ధరతో పోలిస్తే రెండొందలు తక్కువే.ఇక నూక, తేమ పేరుతో రైతులకు మరింత తగ్గించి ఇస్తున్నారు. దీంతో వారు మరింత నష్టపోతున్నారు.

ఇక అకాల వర్షాలతో ఎంత నష్టం ఏర్పడింది అన్న అంచనా కూడా వేయలేకపోయింది జగన్‌ సర్కార్‌. రైతులకు భరోసా ఇచ్చేందుకు కనీసం ఒక్క ప్రకటన చేయడం లేదు. రైతులకు ఇలాంటి సమయాల్లో ధైర్యం చెప్పే వారు కావాలి. అలాంటి పరిస్థితే అంతకంతకూ కరువవుతోంది. మొద్దు నిద్ర పోతున్న సర్కార్‌ నిద్ర లేచేదెప్పుడు.. సాయం చేసేది ఎప్పుడు అన్న విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story