జగనన్న విదేశీ విద్య పథకానికి కత్తెర

జగనన్న విదేశీ విద్య పథకానికి కత్తెర
జగనన్న విదేశీ విద్య పథకానికి వైసీపీ ప్రభుత్వం కత్తెరేసింది. ఇప్పటికే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ పథకానికి దూరమయ్యారు

జగనన్న విదేశీ విద్య పథకానికి వైసీపీ ప్రభుత్వం కత్తెరేసింది. ఇప్పటికే పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఈ పథకానికి దూరమయ్యారు. ఇప్పుడు వీరి సంఖ్య మరింత తగ్గిపోయేలా మార్గదర్శకాల్లో సవరణలు చేశారు. పథకం ఇస్తున్నట్లు చూపిస్తూనే.. పేదలకు పూర్తి స్థాయిలో అందకుండా నిబంధనల్లో మార్పులు తెచ్చింది. గతేడాది క్యూఎస్‌ ర్యాకింగ్‌లో టాప్‌ 200లో ఉన్న యూనివర్శిటిల్లో సీట్లు పొందిన వారికి సాయాన్ని అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. ఇప్పుడు సబ్జెక్టులవారీగా టాప్‌ 50 ర్యాంకుల్లో ఉన్న వాటికే సాయం ఇస్తామంటూ సవరణ చేసింది. సబ్జెక్టులవారీగా యూనివర్శిటీలను విభజించింది.

ఒక్కో సబ్జెక్టుకు 50 నుంచి 70 యూనివర్శిటీలకు కేటాయించింది. ఏ సబ్జెక్టులో పీజీ చదవాలనుకుంటున్నారో దానికి ప్రభుత్వం సూచించిన టాప్‌ 50లో ఉన్న వాటిల్లో సీటు సంపాదించాలి. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం వాటిని గోప్యంగా ఉంచింది. ప్రభుత్వం నిర్దేశించిన 21 సబ్జెక్టుల వారీగా టాప్‌ 50 ర్యాంకుల్లో నిలిచిన యూనివర్శిటీల్లో సీటు సంపాదించిన వారికి సాయాన్ని అందిస్తామని తెలిపింది. టాప్‌ 50 ర్యాంకుల్లో నిలిచిన యూనివర్శిటిల్లో సీటు సంపాదించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 100% ఫీజు లేదా 1 కోటి 25 లక్షలు, అదే విధంగా ఇతర సామాజిక వర్గాలకు చెందిన విద్యార్థులకు 100% ఫీజు లేదా కోటి రూపాయల వరకు అందిస్తామని స్పష్టం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story