- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- మహానాడుపై జగన్ సర్కార్ కుట్రలు
మహానాడుపై జగన్ సర్కార్ కుట్రలు

మహానాడుపై జగన్ సర్కార్ కుట్రలు మొదలయ్యాయి. టీడీపీ మహా పండగను అడుగడుగునా అడ్డుకునేందుకు స్కెచ్ రెడీ అయ్యింది. రాజమహేంద్రవరంలో తెలుగుదేశం పార్టీ రేపు, ఎల్లుండి నిర్వహిస్తున్న మహానాడుకు ఆర్టీసీ బస్సులను ఇవ్వకుండా ఆ సంస్థ యాజమాన్యం తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. ప్రతిపక్ష పార్టీ కార్యక్రమానికి ఒక్క బస్సు కూడా బుక్ చేసుకోవడానికి వీల్లేకుండా ఉద్దేశపూర్వకంగా తాత్సారం చేస్తోంది. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు లేఖ రాసినా.. ఆర్టీసీ అధికారుల్లో ఏమాత్రం చలనం రావడం లేదు. దీంతో.. ఆర్టీసీ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ప్లీనరీకి దండిగా బస్సులు సమకూర్చిన ఆర్టీసీ.. టీడీపీ మహానాడుకి ఒక్కటీ ఇవ్వకుండా దోబూచులాడుతోంది. సర్కారీ ఆదేశాలతో ఆర్టీసీ వెనుకడుగు వేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి.
ఏ పార్టీ అయినా, సంస్థ అయినా, వ్యక్తులైనా.. తమ సొంత కార్యక్రమాలు, వేడుకలు, సభలు, సమావేశాలకు ఆర్టీసీ బస్సులు కావాలంటే వాటికి నిర్దేశిత అడ్వాన్స్‌ను ముందే చెల్లించి, బుక్‌చేసుకుని తీసుకోవచ్చని గతంలో ఆర్టీసీ ప్రకటించింది. ఇలా ఎన్ని బస్సులు అయినా సమకూరుస్తామని... దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం వస్తుందని పేర్కొంది. వైసీపీ ప్లీనరీకి ఆ పార్టీ అడ్వాన్స్ చెల్లించి బస్సులు బుక్‌చేసుకుందని.. వాళ్లు కోరిన చోటికి వాటిని పంపామని గత ఏడాది వైసీపీ ప్లీనరీకి 18 వందల ఆర్టీసీ బస్సులను పంపడంపై ఆ సంస్థ అధికారులు వివరణ ఇచ్చారు. ఐతే.. ఇప్పుడు టీడీపీ రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులను తీసుకెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు కావాలంటూ ఆ పార్టీ నేతలు వివిధ డిపోల మేనేజర్లను కొద్దిరోజులుగా కోరుతున్నారు. అడ్వాన్స్ కింద ఎంత మొత్తం ఇవ్వాలో చెప్పాలని అడుగుతున్నారు. అయినా అధికారులు స్పష్టత ఇవ్వకుండా, ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉందని చెబుతూ దాటవేస్తున్నారు.
గతేడాది జులైలో గుంటూరుజిల్లా నాగార్జున విశ్వవిద్యాలయానికి సమీపంలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీకి.. ఏకంగా 2 వేల బస్సులను బుక్‌చేసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు కూడా బస్సులు సిద్ధంచేశారు. ఇందులో 18 వందల బస్సులను వైసీపీ నేతలు వినియోగించుకున్నారు. ప్రయాణికుల అవస్థలను ఏమాత్రం పట్టించుకోకుండా బస్సులన్నీ ప్లీనరీకి పంపారు. అప్పుడు అధికార పార్టీకి ఆర్టీసీ అధికారులు సాహో అన్నారు. ఇప్పుడు టీడీపీ నిర్వహిస్తున్న మహానాడుకు బస్సులు ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. గత ఏడాది ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు కూడా ఆర్టీసీ బస్సులను బుక్ చేసుకోనివ్వలేదు. కొన్ని డిపోల మేనేజర్లు అడ్వాన్స్‌గా డబ్బులు తీసుకొని, బస్సులు పంపేందుకు సిద్ధమైనా, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాలతో అలా కట్టిన సొమ్మును వెనక్కి ఇచ్చేశారు.
ఇవాళ అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా జరిగే సీఎం సభ కోసం వివిధ జిల్లాల నుంచి మొత్తంగా 780 బస్సులను ఆర్టీసీ ఏర్పాటుచేసింది. ఈనెల 24న కొవ్వూరులో సీఎం పాల్గొన్న విద్యాదీవెన సభ కోసం.. కాకినాడ, తూర్పుగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లా ల నుంచి 195 ఆర్టీసీ బస్సులు పంపారు. కానీ రాజమహేంద్రవరంలోని టీడీపీ మహానాడుకు మాత్రం ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వకుండా అధికారులు ముఖం చాటేస్తున్నారు. వివిధ ప్రైవేటు విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలకు చెందిన బస్సుల పైనా రవాణాశాఖ అధికారులు ఆంక్షలు పెడుతున్నారు. వేసవి సెలవుల్లో విద్యార్థుల బస్సులను ఎలా బయటకు తీస్తారని, ఫిట్‌నెస్ పేరిట వాటికి తనిఖీలు జరిపి, భారీగా జరిమానాలు విధించేలా చూస్తామని హెచ్చరిస్తున్నారు. వైసీపీ ప్లీనరీకి, ప్రభుత్వ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో ప్రైవేటు సంస్థల బస్సులను వినియోగించినప్పుడు లేని నిబంధనలు ఇప్పుడే గుర్తుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మహానాడుకు ఆర్టీసీ బస్సులు అడిగితే ఇవ్వడంలేదని, ప్రైవేటు విద్యాసంస్థల బస్సులను వినియోగిద్దామంటే వారినీ బెదిరిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఎన్ని ఆటంకాలు సృష్టించినా అభిమానులు ఆగరని, సొంత ఏర్పాట్లతో తరలి వస్తారని స్పష్టం చేస్తున్నారు. అటు.. నడిచైనా వచ్చేందుకు టీడీపీ శ్రేణులు పట్టుదలగా ఉన్నారు. ఆటోలు, మ్యాజిక్ క్యాబ్‌లు, మోటారు సైకిళ్లు, కార్ల మీదే ప్రజలు, పార్టీ శ్రేణులు తరలిరానున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఆటోలు, మ్యాజిక్ క్యాబ్‌వంటివన్నీ బుక్ చేశారు. ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో పాటు, పార్టీ పదవులు ఉన్నవారు, మండల, గ్రామ స్థాయి నాయకులంతా ఎవరికి వారు వాహనాల ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. రాజమహేంద్రవరం పరిసర ప్రాంత నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 30 వేల మందికి పైగా జనం తరలి రానుండగా.. ఇతర నియోజకవర్గాల నుంచి కనీసం 15 వేల మంది చొప్పున వస్తారని అంచనా వేస్తున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com