పసుపు పండుగకు గోదావరి తీరం ముస్తాబైంది

పసుపు పండుగకు గోదావరి తీరం ముస్తాబైంది

తెలుగుదేశం పసుపు పండుగ మహానాడుకు గోదావరి తీరం ముస్తాబైంది. రేపు, ఎల్లుండి.. రెండ్రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడు సమావేశాలు, సభలకు రాజమండ్రి సిద్ధమైంది. ఈ మహానాడులోనే ఎన్నికల తొలి మేనిఫెస్టోను టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించనున్నారు. గ‌తంలో జ‌రిగిన మ‌హానాడుల‌కు ఇప్పుడు జ‌రుగుతోన్న పసుపు పండుగ ఎంతో ప్రత్యేకమైంది. ఏడాది మొత్తం ఎన్టీఆర్ శ‌త జ‌యంతి వేడుక‌ల‌ను జ‌రిపిన టీడీపీ.. ఈ మ‌హానాడును అంత‌కు మించి ఎంతో ప్రతిష్టాత్మకంగా జ‌రుపుతోంది. దాంతో టీడీపీ జెండాలు, తోరణాలు, ఫెక్సీలతో రాజమహేంద్రవరం వీధులు, దారులు.. గోదవరి తీరాలు పసుపుమయంగా మారాయి.

రాజమండ్రి వేదికగా తలపెట్టిన మహానాడులో టీడీపీ ఎన్నికల శంఖారావం పూరిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఎన్నికలు ఏ క్షణంలో జరిగినా ఎదుర్కొనే దిశగా ఇప్పటికే టీడీపీ శ్రేణులను చంద్రబాబు సమాయత్తం చేశారు. రెండు రాష్ట్రాల్లోను టీడీపీ విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు. ఇక వచ్చే ఏడాది 2024 ఏపీలో ఎన్నికలు జరగనున్న వేళ.. అధిక ప్రాధాన్యం ఏర్పడింది. సాయంత్రం రాజమండ్రిలో చంద్రబాబు అధ్యక్షతన పొలిట్‌బ్యూరో సమావేశం జరగనుంది. ఈ కీలక సమావేశలోనే టీడీపీ ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. మహిళలు, రైతులు, యువతకు అధిక ప్రాధాన్యం కల్పించేలా రూపొందించిన ఈ తొలి మేనిఫెస్టోను ఇవాళ జరిగే పొలిట్‌బ్యూరో సమావేశంలో ఆమోదం తెలుపనున్నారు. అటు ఈ మహానాడులో మొత్తం 24 తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి తీర్మానాలను వేర్వేరుగా మహానాడులో ప్రవేశపెడుతోంది టీడీపీ. ఏపీకి సంబంధించిన 14 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించిన 6 తీర్మానాలు, అలాగే 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనున్నట్లు టీడీపీ నేతలు అంటున్నారు.

ఇక ఆంధ్రప్రదేశ్‌ తీర్మానాలను చూస్తే.. అందులో ధరలు, పన్నులు, ఛార్జీల బాదుడే బాదుడు మొదటి తీర్మానంగా ఉంది. తర్వాత రైతును దగా చేసిన జగన్‌రెడ్డి పాలన, తీవ్ర సంక్షోభంలో వ్యవసాయం కాగా.. మహిళా సంక్షేమంలో కోతలు, అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు తీర్మానం ఉంది. నాలుగో తీర్మానం జాబ్ క్యాలెండర్ మాట తప్పి మడమ తిప్పారు ఉండగా.. టీడీపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాల భర్తీకి హామీ ఇవ్వడంతో పాటు యువగళం - జన ప్రభంజనం తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఐదో తీర్మానం వైసీపీ ప్రభుత్వం బీసీ - ఈబీసీలకు చేసిన ద్రోహం కాగా.. ఆరో తీర్మానం సంక్షోభంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, ఏడో తీర్మానం దిగజారిన విద్యా ప్రమాణాలు - వైద్య ఖర్చులను భరించలేక అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబాలు - ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారిన తీరును ఎండగట్టనున్నారు. ఇక ఎనిమిదో తీర్మానం.. పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు - అడుగంటిన పారిశ్రామిక ప్రగతి ఉండగా, తొమ్మితో తీర్మానంలో జగన్ సర్కారు ఉద్యోగ, కార్మికులకు దగా కాగా, పదో తీర్మానంలో అభివృద్ధి విధ్వంసం - జీరో డెవలప్‌మెంట్ - ఇదేమి ఖర్మ రాష్ట్రానికి, అలాగే పదకొండో తీర్మానంలో సహజ వనరుల దోపిడీ - లాండ్, శాండ్, వైన్, మైన్, డ్రగ్స్, గంజా, రెడ్ శాండిల్ మాఫియా ఉంది. పన్నెండో తీర్మానం ఏపీలో అప్పుల తిప్పలు - వడ్డీల ఊబిలో రాష్ట్రం, పదమూడో తీర్మానంలో రాక్షస పాలన - రాజకీయ రాబందుల స్వైరవిహారం, పద్నాలుగో తీర్మానంగా ఏపీలో వ్యవస్థల విధ్వంసాన్ని టీడీపీ ఎండగట్టనుంది.

అటు తెలంగాణకు సంబంధించి ఆరు రాజకీయ తీర్మానాలను మహానాడు వేదికగా ప్రవేశపెట్టనుంది టీడీపీ. అందులో మొదటిది అకాల వర్షాలతో నష్టపోతున్న రైతులు - సరైన పరిహార విధానాలు అమలు చేయడంలో వైఫల్యం చెందుతున్న ప్రభుత్వం ఉంది. రెండో తీర్మానంలో ప్రశ్నాపత్రాల లీకేజీలు - ఆందోళనలో నిరుద్యోగులు, మూడో తీర్మానం విభజన చట్టం హామీల అమలు - కేసీఆర్ హామీలు, మేనిఫెస్టో హామీలు, నాలుగో తీర్మానంలో మహిళలపై పెరిగిన అఘాయిత్యాలు, ఐదో తీర్మానం.. పూర్తి కాని సాగునీటి ప్రాజెక్టులు, ఆరో తీర్మానం.. అకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు - పేద, మధ్య తరగతి ప్రజల జీవనం దుర్భరం అంశాలు ఉన్నాయి.

ఇక ఏపీ, తెలంగాణకు సంబంధించి 4 ఉమ్మడి తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీడీపీ. అందులో మొదటిది ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, ఎన్టీఆర్‌కు ముందు ఎన్టీఆర్ తర్వాత తెలుగువారి చరిత్ర తీర్మానం ఉంది. రెండో తీర్మానం టీడీపీ 41 వసంతాల ప్రస్థానం, మూడో తీర్మానం.. అమరులైన కార్యకర్తలకు ఘన నివాళి, నాలుగో తీర్మానంలో కార్యకర్తల సంక్షేమాన్ని ప్రవేశపెట్టనుంది టీడీపీ.

Read MoreRead Less
Next Story