- Home
- /
- ఆంధ్రప్రదేశ్
- /
- అమరావతిలో మరోసారి హైటెన్షన్
అమరావతిలో మరోసారి హైటెన్షన్

రాజధాని అమరావతిలో మరోసారి హైటెన్షన్ నెలకొంది. అమరావతి గ్రామాల్లో శాంతియుత నిరసనలకు రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చింది. సీఎం జగన్ అమరావతిలో పర్యటనకు వ్యతిరేకంగా అమరావతి రైతులు, మహిళలు ఆందోళన చేపట్టారు. వెలగపూడి శిబిరంలో నల్ల జెండాలు, నల్లబెలూన్ల, నల్లబ్యాడ్జీలతో నిరసనకు దిగారు. గో బ్యాక్, గో బ్యాక్ రాజధాని ద్రోహులు అంటూ ప్లకార్డుల ప్రదర్శించారు. జగన్‌కు వ్యతిరేకంగా రాజధాని రైతుల నినాదాలు చేశారు. అమరావతి అభివృద్ధికి ఎన్నడు రాని జగన్ వినాశనానికి వస్తున్నారని రైతులు మండిపడ్డారు. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను జగన్ దెబ్బ తీస్తున్నారని తీవ్రంగా ఆరోపించారు. సెంట్ భూములు పేరుతో పేదల జీవితాలతో కూడా ఆడుకుంటున్నారని విమర్శించారు. రాజధాని గ్రామాల్లో ప్రతి ఇంటిపై నల్ల జెండాలు ఎగరేసి నిరసనలు తెలుపాలని రాజధాని అమరావతి ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
ఇవాళ వెంకటపాలెం వద్ద సెంటు స్థలాల పంపిణీకి ప్రభుత్వ ఏర్పాట్లు చేసింది. దీంతో రాజధాని గ్రామాల్లో ఎటు చూసినా వేలాది మంది పోలీసులు మోహరించారు. రైతుల ఆందోళనల పిలుపునిచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేసారు పోలీసులు. సెంటు పట్టాలు పొందే వారితో పాటు, వారి కుటుంబ సభ్యులను కూడా సభకు హాజరు కావాల్సిందే అంటూ ఇప్పటికే వాలంటీర్లు హుకుం జారీ చేసారు. అటు సెంటు స్థలాలు పొందే వారిలో చాలామంది వైసీపీ కార్యకర్తలు ఉన్నారంటూ అమరావతి రైతులు ఆరోపిస్తున్నారు. కారులో తిరిగే వారికి, ఖరీదైన సొంతిల్లు ఉన్నవారికి సెంటు స్థలాలు మంజూరు చేస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com