లోకేష్ 100వ రోజు పాదయాత్రలో తల్లి భువనేశ్వరి

టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటితో వంద రోజులు పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రలో నందమూరి, నారా కుటుంబసభ్యులు పాల్గొననున్నారు. కుమారుడు లోకేష్‌తో కలిసి తల్లి భువనేశ్వరి నడవనున్నారు. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభించిన మహాపాదయాత్ర ఇప్పటివరకు 34 నియోజకవర్గాల మీదుగా సాగింది. ఈ రోజుతో 1,268 కిలోమీటర్లు పూర్తి చేసుకుంటోంది. లోకేశ్‌కు ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, టీడీపీ శ్రేణుల నుంచి ఘన స్వాగతం లభిస్తోంది. ఆయా జిల్లాలతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు, టీడీపీ నా యకులు తరలివచ్చి సంఘీభావం చెబుతున్నారు.
మండే ఎండలను, భారీ వర్షాలను లెక్క చేయకుండా లోకేష్ పాదయాత్ర సాగుతోంది. వంద రోజుల్లో 32 సభలు, వివిధ వర్గాలతో 87 ముఖాముఖిలను నిర్వహించారు. ప్రజల నుంచి 1,900కు పైగా విన్నపాలు అందాయి. ప్రతి వంద కిలోమీటర్ల మజిలీలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించిన శిలాఫలకాన్ని లోకేష్ ఆవిష్కరించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో దాన్ని పూర్తి చేస్తామని ప్రకటిస్తున్నారు. ఇప్పటివరకు 12 అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన శిలాఫలకాలు లోకేష్ ఆవిష్కరించారు. ప్రతి రోజూ తనను కలవడానికి వచ్చే కార్యకర్తలు, అభిమానులతో సెల్ఫీ విత్ లోకేష్ పేరుతో ఇప్పటివరకు లక్షా 40వేల ఫొటోలు దిగారు.
టీడీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టుల గురించి ప్రజలకు గుర్తు చేస్తూ.. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ లోకేష్ విసురుతున్న సెల్ఫీ ఛాలెంజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. వివిధ వర్గాలతో ముఖాముఖి నిర్వహిస్తూ వారి సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. రైతులు, యువత, మహిళలు, ముస్లింలతోపాటు బీసీలు, ఎస్సీ ఎస్టీలు, వ్యాపారులు, ఐటీ నిపుణులు.. ఇలా వివిధ వర్గాలవారితో లోకేశ్ సమావేశాలు నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను వన్‌టైమ్ సెటిల్‌మెంట్ చేస్తామని విద్యార్ధులకు లోకేష్ హామీ ఇచ్చారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్, ఏటా జాబ్ క్యాలెండర్, పరిశ్రమల్ని తీసుకురావడం ద్వారా యువతకు స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు.
బీసీల రక్షణకు ఎస్సీ, ఎస్టీల తరహా చట్టం, ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్, వక్ఫ్‌బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు, చేనేతలు, రజక వృత్తి పనివారికి ఉచిత విద్యుత్‌వంటి హామీలిచ్చారు నారా లోకేష్. ప్రతి జిల్లాలో ఒక చోట నిర్వహించే హలో లోకేష్ కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది. తిరుపతిలో ఫిబ్రవరి 2న విద్యార్థులతో, ఏప్రిల్ 8న అనంతపురం జిల్లా శింగనమలలో రైతులతో, ఏప్రిల్ 24న ఆదోనిలో సర్పంచులతో, మే 7న కర్నూలులో ముస్లిం మైనారిటీలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఆయా సందర్భాల్లో పలు హామీలిచ్చారు.
ప్రతి నియోజకవర్గంలో బహిరంగ సభలు నిర్వహిస్తూ.. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను లోకేష్ ఎండగడుతున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతిని ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. దీంతో యువగళం గొంతు నొక్కేందుకు ప్రభుత్వం తొలి రోజు నుంచీ ప్రయత్నించింది. జీవో1ని చూపించి అవరోధాలు సృష్టించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com