ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు..2022-23లోనే 28వేల కోట్లతో రికార్డ్

ఏపీలో జోరుగా మద్యం అమ్మకాలు..2022-23లోనే 28వేల కోట్లతో రికార్డ్
మద్యం అమ్మకాలు మూడు క్వార్టర్లు,ఆరు ఫుల్‌ బాటిళ్లు అన్నట్లు సాగుతుంది

మద్యం అమ్మకాలు ఏపీలో మూడు క్వార్టర్లు,ఆరు ఫుల్‌ బాటిళ్లు అన్నట్లు సాగుతుంది. ఒక్క 2022-23లోనే 28వేల కోట్లతో ఆల్‌టైమ్‌ హై రికార్డ్ సాధించింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో దాదాపు లక్ష కోట్ల ఆదాయం వచ్చింది. భవిష్యత్‌లో వచ్చే లిక్కర్‌ ఆదాయాన్ని చూపించి వేల కోట్లు అప్పులు తెచ్చేసిన వైసీపీ ప్రభుత్వం.. చివరికి నిషేధం మాటే మర్చిపోయిందని విమర్శిస్తున్నాయి. 2019 ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో మద్య నిషేధంపై స్పష్టమైన హామీ ఇచ్చారు జగన్. కాపురాల్లో మద్యం చిచ్చు పెడుతోందని, మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయని అందుకే నిషేధం తెస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు దశల్లో మద్యం నిషేధిస్తామన్నారు.కానీ మద్యమే ఇప్పుడు రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారు.

ఇక షాక్‌ కొట్టేలా మద్యం ధరలు పెంచారు. నిషేధం తీసేసి నియంత్రణ అన్నారు.నాలుగుసార్లు ధరలు తగ్గించి అమ్మకాలు పెంచారు.ఆదాయమూ కూడా భారీ పెంచుకున్నారు. ఎంతలా అంటే నాలుగేళ్లలో దాదాపు లక్ష కోట్లు ఆదాయం వచ్చేలా మద్యం అమ్మకాలను పెంచింది సర్కార్‌ గత ప్రభుత్వ హయాంలో మద్యంపై 69 వేల 766 కోట్ల ఆదాయం వస్తే వైసీపీ ప్రభుత్వం మరో 35 వేల కోట్లు అదనంగా రాబట్టింది. సంక్షేమ పథకాలను మద్యం ఆదాయంతోనే అమలు చేస్తున్నామని ఓపెన్‌గా చెప్పుకుంటుంది జగన్‌ సర్కార్‌.

మరోవైపు మద్యం అమ్మకాలు తగ్గాయి. ధరలు పెంచడంవల్లే ఆదాయం పెరిగిందని మొదట్లో వైసీపీ నేతలు వాదించారు. నాలుగేళ్ల పాలనలో మద్యం లెక్కలు మొదటికొచ్చాయి. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017-18లో లిక్కర్‌ 3.6 కోట్ల కేసులు అమ్మారు.జగన్‌ అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరం 2019-20లో 3.08 కోట్ల కేసుల మద్యం అమ్మారు.భారీగా ధరలు పెంచడంతో 2020-21లో 1.87కోట్ల కేసులకు అమ్మకాలు పడిపోయాయి. అయితే ఇది మద్యపాన నియంత్రణే అనుకున్నారు ప్రజలు కానీ ఆ నియంత్రణ ఒక్క సంవత్సరానికి మాత్రమే పరిమితమైంది. 2021-22లో మద్యం విక్రయాలు 2.63 కోట్ల కేసులకు చేరాయి. ఇక 2022-23లో అది 3.1కోట్ల కేసులకు వచ్చింది. అంటే ఒక్క ఏడాది అమ్మకాలు తగ్గించి, తర్వాత వరుసగా పెంచుతూ వచ్చారు.

అమ్మఒడి మొదలు ఎన్నో పథకాలకు ఇప్పుడు ఈ లిక్కర్‌ సేల్స్‌పై వచ్చే ఆదాయమే కీలకంగా మారింది. అందుకే.. నాడు మధ్యనిషేధం అని ఆర్భాటంగా ప్రకటనలు చేసి.. ఇప్పుడు నియంత్రణ అంటూ రూటు మార్చారు. నవరత్నాలు లోగోలో మద్య నిషేధం బదులు నియంత్రణ అనడంలోనే 2019లో ఇచ్చిన హామీపై 2022కి వచ్చేసరికి అమలు సాధ్యం కాదంటూ చేతులు ఎత్తేశారనే విమర్శలు వస్తున్నా.. వైసీపీ నేతలు మాత్రం నియంత్రణ పల్లవే ఆలపిస్తున్నారు. దశలవారీగా నిషేధిస్తామనే చెప్పామని అంటున్నారు. అలా నిషేధించే దశ ఎప్పుడు వస్తుందంటే మాత్రం మాట పెగలడం లేదు.

Tags

Read MoreRead Less
Next Story