మే 4న రుషికొండ తుది విచారణ

విశాఖలో రుషికొండ అక్రమ తవ్వకాలపై మే 4న ఏపీ హైకోర్టులో తుది విచారణ జరగనుంది. ఈమేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్ర, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. విశాఖలోని రుషికొండను టూరిజం రిసార్ట్స్ అభివృద్ధి పేరుతో విచక్షణారహితంగా తవ్వేస్తున్నారు. పరిధికి మించి నిర్మాణాలు చేస్తున్నారంటూ విశాఖ తూర్పు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, జనసేన కార్పొరేటర్ పీవీఎల్‌ఎన్ మూర్తియాదవ్ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలతో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన కమిటీ.. రుషికొండ తవ్వకాలు, నిర్మాణాల్లో ఉల్లంఘనలు జరిగాయని ఇప్పటికే నివేదిక ఇచ్చింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ నుంచి పొందిన అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టారని తెలిపింది. నిన్న జరిగిన విచారణలో వివరాలను పరిశీలించిన ధర్మాసనం.. మే 4న తుది విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com