పట్టబద్రుడు చెప్తున్న పాఠం - జగన్ కు గుణపాఠం

పట్టబద్రుడు చెప్తున్న పాఠం - జగన్ కు గుణపాఠం


ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి ప్రజలు కొట్టిన పెద్ద చెంప దెబ్బ. పరిపాలనలో, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా రచనలోనూ అధికార పార్టీ బాధ్యతగా వ్యవహరిస్తుందనీ ప్రజల పట్ల ఎలాంటి ముందుచూపు లేదన్న విమర్శలను జగన్ ప్రభుత్వం ఇంతకాలం బేఖాతరు చేస్తూ వచ్చింది. ఈ అంశాలపై ప్రతిపక్షాలు చేస్తున్న నిరసనలను చిన్న చూపు చూస్తూ అహంకారం ప్రదర్శించింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా గెలుస్తున్న ఎన్నికల ఫలితాలే జగన్ పట్ల మాత్రమే ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని జగన్ వైఖరిని మూర్ఖంగా సమర్దించుకుంది. కానీ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో జరిగిన ఎన్నిక ఫలితాలు అధికార పార్టీకి వాస్తవ స్థితిని కళ్ళ ముందు ఉంచాయి. ఉత్తరాంధ్ర, తూర్పు- పశ్చిమ రాయలసీమ ల్లో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 108 స్థానాల్లో ఈ ఎన్నికలు జరిగాయి. మూడింటికి మూడూ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవడం అంటే అధికార పార్టీకి అంతకు మించిన దెబ్బ అవసరం లేదు. అతి విశ్వాసంతో ప్రజల, ప్రతిపక్షాల ఆవేదనను అర్థం చేసుకోవడంలో వారు ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఈ ఫలితం ఎత్తిచూపింది.

ఫలించని ప్రలోభాలు..

సాధారణంగానే ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకునే జగన్ పార్టీ ఈ ఎన్నికలను ప్రభావితం చేసేందుకు చేయని ప్రయత్నం లేదు. అనుకూల వ్యక్తులను ఓటర్ల జాబితాలో చేర్చుకున్నారు. నాలుగు, ఐదు తరగతులకు కూడా చదవని మహిళల అనేకమంది మీడియా కెమెరాలకు బహిరంగంగానే దొరికిపోయారు. విశాఖ రాజధానిగా ప్రకటనలు చేసినా.. ప్రభుత్వ తీరుపై అసంతృప్తిగా వున్న ఉద్యోగ వర్గాలను బుజ్జగించేందుకు ఎన్నికకు ముందు సమావేశాలు నిర్వహించినా, పెట్టుబడుల సదస్సు పేరిట పెద్ద పెద్ద ఈవెంట్లు నిర్వహించినా, ఓటర్లను ప్రలోభాలకు గురిచేసినా పట్టభద్రుడు మాత్రం పరిణతినే ప్రదర్శించాడు. సైలెంటుగా తాను ఏం కోరుకుంటున్నాడు, ప్రభుత్వ వైఖరిపట్ల ఎంత విరక్తిగా వున్నాడో చెప్పేసాడు.


తెలిపోయిన సజ్జల డొల్లమాటలు...

ఫలితాల నెగిటివ్ ప్రభావాన్ని కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ చేసిన ప్రయత్నమూ తేలిపోయింది. పట్టభద్రుల ఎన్నికలంటే మొత్తం ఓటర్లలో కేవలం ఒక చిన్న భాగం మాత్రమే.. మా పార్టీ ద్వారా లబ్ధి పొందిన అసలు ఓటర్లు వేరే ఉన్నారు వారిని కలుపుకుంటే మాపై పెద్ద ప్రభావం ఉండదు అని అధికార పార్టీ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని డొల్ల వ్యాఖ్యలు చేసారు. ఆ వ్యాఖ్యలు వాస్తవ విరుద్ధం కూడా. ఒకరకంగా చెప్పాలంటే ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఏరకంగా ఉందో తెలుసుకునేందుకు అసలైన శాంపిల్ సర్వే ఇది. ఎందుకంటే పట్టభద్రులే రాష్ట్ర పనితీరు గమనిస్తున్న అసలైన పరిశీలకులు. పది లక్షలకు పైగా పట్టబద్రులు ఓటర్లుగా నమొదలైన ఎన్నిక ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం పట్ల ప్రజల వైఖరి ఏ రకంగా ఉందో తెలుసుకునే అవకాశం ఉంది. ఉద్యోగులు, నిరుద్యోగులు, దళితులు, బలహీన వర్గాల వారు, ఉన్నత వర్గాల వారు, ప్రజల్ని ప్రభావితం చేయగల ఒపీనియన్ లీడర్స్ ఉంటారు కాబట్టి వీరి నిర్ణయం ద్వారా వెలువడిన ఈ ఫలితం కచ్చితంగా రాబోయే ఎన్నికల ఏ రకంగా ఉండబోతుందో క్లియర్ గా చెప్పే అసలైన సర్వేగా భావించాలి.

న్యూట్రల్ ఓటర్ నాడి దొరికింది.

ఎన్నికల్లో ఓటర్ల నాడిని విశ్లేషించే సెఫాలజి పరంగా చూసిన అధికార పార్టీకి ఎన్నిక ఫలితం పెద్ద దెబ్బ. సాధారణంగా ప్రతి పార్టీకి ఒక నిర్దిష్ట ఓటు బ్యాంకు ఉంటుంది. వారి వారి పార్టీలు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ మేరకు ఓట్లు ఆ పార్టీకి పడి తీరుతాయి. గత ఎన్నికల్లో ఘోర పరాజయం జరిగినప్పటికీ తెలుగుదేశం పార్టీకి 40 శాతం ఓట్లు పడడం ఆ పార్టీ అసలు బలానికి నిదర్శనం. ఇదే రకంగా వైసిపికి కూడా సొంత ఓటు బ్యాంకు ఉంటుంది. కానీ గెలుపోటములను నిర్దేశించేది మాత్రం సైలెంట్ గా ఉండే మరో 20 శాతం ఓట్లే. వారిలో అత్యధికులు ఈ గ్రాడ్యుయేట్లలో భాగమే. ఉద్యోగులు, పట్టణ ప్రజానికం, ఏ పార్టీకి చెందని పార్టీకి చెందని వారుంటారు. అంటే సైలెంట్ లేదా న్యూట్రల్ ఓటర్లలో మెజారిటీ సభ్యుల సరళి ఏరకంగా ఉందనేది ఎన్నిక స్పష్టంగా చెప్తుంది. సో 2024 నాటికి ఫలితాలను మార్చబోయే న్యూట్రల్ ఓటర్లు ఇప్పటికే తమ నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్నారని చెప్పొచ్చు. దీనికి తోడు రెండవ ప్రాధాన్యత ఓట్లలో తెలుగుదేశం పార్టీ నిలబెట్టిన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు దక్కడం మరొక స్పష్టమైన తెలుగుదేశం అనుకూల సంకేతం. ప్రతి చోటా జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం వైసీపీ లతో పాటు బిజెపి, కమ్యూనిస్టులు, ఇతర ఇండిపెండెంట్ లో తమ సొంత ఓట్లని పొందినా వారి వారి రెండో ప్రాధాన్యత ఓట్లు అత్యధిక శాతం తెలుగుదేశం అభ్యర్థులకు పడడం అంటే అది ఖచ్చితంగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మోగిన ఢంకా గానే చూడాలి.

ప్రతిపక్షాల ఐక్యత మరింత అవసరం.

ప్రతిపక్షాలకు సైతం పట్టభద్రుల ఎన్నికల ఫలితాలు మరొక కీలక సూచన చేస్తున్నాయి మొదటి ప్రాధాన్యత ఓట్లలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అత్యధిక ఓట్లతో వైసీపీని వెనక్కు నెట్టినప్పటికీ గెలుపునకు ఆవసరమైన ఓటు బలం ఇతర ప్రతిపక్షాల ఓటర్లు వేసిన రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా దక్కింది. అంటే ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా నైనా ప్రతిపక్షాల ఐక్యత ఇక్కడ సంభవించింది.. అదే జగన్ పార్టీని ఓడించేందుకు బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడింది. ఇదే ప్రతిపక్షాల ఐక్యతను రానున్న రోజుల్లోనూ కొనసాగిస్తే 2024లో జగన్ ప్రభుత్వాన్ని ఓడించేందుకు 175 శాతం అవకాశం ఉంది.

అందుకే ఐక్యంగా ఉండడంలో ప్రతిపక్షాలు చూపాల్సిన జాగ్రత్తను.. నెత్తికెక్కిన కళ్ళను వాటి స్థానంలో కి తెచ్చుకోవడానికి అధికార పార్టీకి ఈ ఫలితాలు పెద్ద సందేశాన్నిచ్చాయి. అయితే అధికార పార్టీకి మాత్రం ఇప్పటికే చేతులు కాలిపోయాయి ఇప్పుడు ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదేమో.

Tags

Read MoreRead Less
Next Story