వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైట్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్రంగా మోదీ ప్రభుత్వంపై కేసీఆర్ ఫైట్

కేంద్రంపై మరో ఫైట్ కు సిద్దమైంది బీఆర్ఎస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను దక్కించుకునేందుకు వ్యూహ రచన చేస్తోంది. బైలాడిల్లాను కేంద్రం అదానీకి కట్టబెడితే... వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను తాము దక్కించుకోవాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే తెలంగాణ అధికారుల బృందాన్ని వైజాగ్ కు పంపింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో దూకుడుగా వ్యవహరించాలని కేసీఆర్‌ సర్కారు డిసైడైయిందని కేటీఆర్ వ్యాఖ్యలే నిదర్శనమంటున్నారు గులాబీ నేతలు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం ఇచ్చిన ఎక్స్ ప్రేషన్ ఆఫ్ ఇంట్రెస్ బిడ్డింగ్ లో ప్రక్రియలో పాల్గొనేందుకు ఇప్పటికే ఓ టీంను పంపింది కేసీఆర్‌ సర్కారు. సాధ్యాసాధ్యలను తెలుసుకోవాలని టీంను ఆదేశించింది. నివేదిక ఇచ్చిన తర్వాత బిడ్డింగ్ లో పాల్గొనాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్ర విభజన సమయంలో బయ్యారం, కడప రెండు ప్రాంతాల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని కేంద్రం చెప్పిందని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్‌. అదానీకి నష్టం జరుగుతుందని బయ్యారంకు ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్న ఆయన.. కేంద్రం చర్యల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు అన్యాయానికి గురయ్యాయన్నారు.

బీఆర్ఎస్ పేరుతో దేశ వ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు కేసీఆర్‌. ఏపీలో బలోపేతం కావాలంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలన్నది కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. బిడ్డింగ్ లో పాల్గొనడంతో తమకు రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేంద్రం అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా ప్రైవేటీకరణను అడ్డుకుంటుందనే సంకేతాలు పంపుతోంది బీఆర్‌ఎస్‌. ఒక వేళ బిడ్డింగ్ దక్కించుకుంటే నైతికంగా కేంద్రం పై విజయం సాధించనట్లవుతుందన్నది గులాబీ శ్రేణుల వ్యూహం. ఇదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కలిసి వస్తుందంటున్నారు ఆ పార్టీ శ్రేణులు. మరి ఇది ఎంతవరకు సక్సెస్‌ అవుతుందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Tags

Next Story