గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం

హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం కొనసాగుతోంది.. తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్‌ కార్యాచరణపై హస్తం నేతలు చర్చిస్తున్నారు.. విస్తృత స్థాయి సమావేశానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. సమావేశంలో పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లు, పీసీసీ సభ్యులు పాల్గొన్నారు.

దేశాన్ని విభజించి అధికారాన్ని పదిలం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.. అందుకే దేశ సమైక్యత కోసం రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేశారన్నారు.. ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం విధ్వంసం చేసిందన్నారు.. ప్జల సంపదను అదానీ, అంబానీలకు బీజేపీ కట్టబెట్టిందని రేవంత్‌ మండిపడ్డారు.. పేదల పక్షాన నిలబడి వారి గళాన్ని రాహుల్‌ గాంధీ వినిపించారన్నారు.. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే రాహుల్‌పై అనర్హత వేటు వేశారని రేవంత్‌ విమర్శించారు.

అధికారం ఉందని విర్రవీగిన మోదీకి కర్నాటక ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు రేవంత్‌. కర్నాటక ప్రజలను అభినందిస్తూ మనం తీర్మానం చేయాల్సిన అవసరం ఉందన్ని పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో రేవంత్‌ చెప్పారు. కర్నాటకలో కాంగ్రెస్‌ గెలుపునకు కారణమైన సోనియా, రాహుల్‌ ప్రియాంక, ఖర్గే, సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ను అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేశారు.. యూత్‌ డిక్లరేషన్‌ను భవిష్యత్‌ కార్యాచరణగా ముందుకు తీసుకెళ్లాలని నేతలకు రేవంత్‌ సూచించారు.

రాజీవ్‌ గాంధీ ఆన్‌లైన్‌ క్విజ్‌ కోసం 100 నియోజకవర్గాల్లో మొత్తం 25 లక్షల మందిని నమోదు చేయించాలన్నారు.. కొడంగల్‌ నియోజకవర్గంలో నమోదు బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్‌ చెప్పారు. అలాగే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీగా జూన్‌ 2న రాష్ట్ర అవతరణ వేడుకలను అద్భుతంగా జరపాలన్నారు. ఉద్యమంలో కాంగ్రెస్‌ క్రియాశీల పాత్రను ప్రజలకు మరోసారి గుర్తు చేయాలన్నారు. ఈ అంశాలపై విలువైన సూచనలు ఇవ్వాలని పార్టీ నేతలను రేవంత్‌ రెడ్డి కోరారు.
ఇక విభేదాల అంశం కూడా కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశంలో చర్చకు వచ్చింది.. పార్టీలో ఎవరూ కోవర్టులు లేరన్నారు రేవంత్‌ రెడ్డి.. పార్టీలో ఎవరికీ విభేదాలు లేవని చెప్పారు.. పార్టీ కోసం, ప్రజల కోసం పెది మెట్లు దిగడానికైనా తాను సిద్ధమని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story