రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండుగ

రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండుగ

ఏపీలో టీడీపీ మాహానాడు సందడి మొదలైంది. ఈనెల 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరం వేదికగా పసుపు పండుగ జరగనుంది.. మహానాడు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శర వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో రాజమహేంద్రవరం, వేమగిరి ప్రాంతాలు పసుపు మయంగా మారాయి.. వేమగిరి, ధవళేశ్వరం పరిధిలోని మహానాడు ప్రతినిధుల సభ వేదిక ఇప్పటికే సిద్ధమైంది.. ఏసీ హాల్‌ను సిద్ధం చేశారు.. పసుపు తోరణాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.. రాజమహేంద్రవరం ప్రధాన వీధుల్లో పసుపు తోరణాలు దర్శనమిస్తున్నాయి.. ఇక మహానాడు కార్యక్రమానికి ఎంత మంది నేతలు, కార్యకర్తలు వచ్చినా అందరికీ తగిన విధంగా ఏర్పాట్లు చేశారు.. ఇక మహానాడు అంటే ప్రత్యేకంగా చెప్పుకునే భోజనాల కోసం కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

అటు పార్టీ అధినేత చంద్రబాబు స్వయంగా అందరికీ ఆహ్వానాలు పంపుతున్నారు.. ఆన్‌లైన్‌ ద్వారా ప్రతినిధులకు ఆహ్వానాలు వెళ్లాయి.. తన డిజిటల్‌ సైన్‌తో ఉన్న ఆహ్వాన పత్రికతో పార్టీ కేడర్‌ను మహానాడుకు ఆహ్వానిస్తున్నారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు జరుపుతామని చంద్రబాబు ఇప్పటికే చెప్పారు.. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్‌ చాటి చెప్పారని, రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు నాంది పలికిన యుగపురుషుడు ఎన్టీఆర్‌ అంటూ ఆహ్వాన పత్రికలో పేర్కొన్నారు చంద్రబాబు.. రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై అలాగే ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ జరుగుతుందన్నారు.. 28న భారీ బహిరంగ సభ జరుగుతుందని చంద్రబాబు ఆహ్వానంలో తెలిపారు.. ఈ మహానాడులో మీరంతా భాగస్వాములు కావాలని సాదరంగా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

మరోవైపు రాజమహేంద్రవరానికి టీడీపీ ముఖ్య నేతలంతా క్యూ కడుతున్నారు.. అటు పాదయాత్రకు తాత్కలికంగా విరామం ఇచ్చి, విమానంలో గన్నవరం ఎయిర్‌పోర్టు చేరుకున్నారు నారా లోకేష్. అక్కడ్నుంచి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. ఇక మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలోనూ మహానాడు సందడి కనబడుతోంది.. ప్రతినిధులకు ఇవ్వాల్సిన సామగ్రిని సిబ్బంది సిద్ధం చేస్తున్నారు.

తెలుగుదేశం పార్టీలో మహానాడు జోష్ నెలకొంది. రెట్టింపు ఉత్సాహంతో ఉరకలేస్తోంది. చరిత్రలో నిలిచేలా ఈనెల 27, 28 తేదీల్లో రెండ్రోజుల పాటు రాజమండ్రి వేదికగా మహానాడు నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కదనరంగంలోకి దూకుతున్న టీడీపీ.. ముందే తొలి మేనిఫెస్టో విడుదలకు సన్నద్ధం అవుతోంది. రైతులు, మహిళలు, యువతే లక్ష్యంగా మేనిఫెస్టోను సిద్ధం చేసింది. దసరాకు పూర్తి స్థాయి మేనిఫెస్టో ప్రకటించే ఆలోచనలో పార్టీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. రేపు రాజమండ్రిలో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో తొలి మేనిఫెస్టోను ఆమోదించనున్నారు.

Tags

Read MoreRead Less
Next Story