ఎన్టీఆర్ జిల్లా రిజర్వ్ ఫారెస్ట్‌లో NGT క్షేత్ర స్థాయి పరిశీలన

ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బృందం పర్యటించింది. కొత్తూరు తాడేపల్లి, నైనవరం, వెలగలేరు, జక్కంపూడి ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని.. కోట్ల రూపాయల గ్రావెల్ అక్రమంగా మైనింగ్ మాఫియా తరలిస్తోందంటూ మాజీ సైనిక అధికారి, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్ర ఫిర్యాదు నేపథ్యంలో.. NGT బృందం క్షేత్ర స్ధథాయిలో పరిశీలించింది. విజయవాడ రూరల్ మండలంలో మట్టి తవ్వకాలను అడ్డుకునేందుకు ఎన్‌జీటీ విచారణ బృందం పరిశీలించింది. మైలవరం నియోజకవర్గం జి.కొండూరు మండలంలోనూ పర్యటించింది. అధికారులు ఆయా ప్రాంతాలకు వెళ్లకూడదనే ఉద్దేశంతో అక్రమార్కులు ముందుగానే ఆటంకాలను సృష్టించారు.
వీటిని అధిగమిస్తూ వెళ్లిన ఎన్‌జీటీ అధికారులు మట్టి కోసం ఇంత లోతుగా, ఎక్కువ విస్తీర్ణంలో అక్రమార్కులెలా తవ్వగలిగారని స్థానిక అధికారులను ప్రశ్నించారు. కొన్ని వందల ఎకరాల్లో మట్టి తవ్వకాలు వారికి కనిపించాయి. వీటిలో ఒక్క దానికీ పర్యావరణ, రెవెన్యూ అనుమతులు లేవని అధికారులు తెలిపారు. సమగ్ర నివేదికనిస్తామని సబ్‌కలెక్టర్ అదితి సింగ్ చెప్పారు. ఫిర్యాదు ప్రకారం ఎన్‌జీటీ సూచించిన గ్రామాలకే ఎన్‌జీటీ బృందం పరిమితమైంది. వెలగలేరులో 50 ఎకరాల క్వారీని పరిశీలించవద్దనే ఉద్దేశంతో అక్రమార్కులు తవ్విన ప్రాంతానికి వెళ్లేందుకు అధికారులు వాహనాలు దిగి కందకాలను దాటుతూ రెండు కిలో మీటర్లు నడిచారు. వెళ్లలేని ప్రాంతాలను డ్రోన్‌తో పరిశీలించారు. ఎన్‌జీటీ బృందానికి మరోసారి స్థానిక అధికారులనుంచి సహాయ నిరాకరణ ఎదురైంది. పరిశీలనకు గనులు, భూగర్భ వనరులు, జలవనరుల శాఖ అధికారులు గైర్హాజరయ్యారు. సమాచారం లేదని, తమ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు లేవనే సమాధానాలు వారినుంచి వస్తున్నాయి.
మట్టి తరలింపుపై పిల్లి సురేంద్రబాబు ఎన్‌జీటీని గతంలో ఆశ్రయించారు. దీనిపై మార్చి 20న బృందం పర్యటించింది. నాడు అధికారులు సక్రమంగా పరిశీలించలేదని ఫిర్యాదుదారు మరోసారి ఎన్‌జీటీకి లేఖ రాశారు. దీంతోవారు మళ్లీ వచ్చారు. ఈసారి బృందంలో కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వశాఖ రీజినల్ సెంటర్ జాయింట్ డైరెక్టర్ పి.సురేష్‌బాబు, ప్రాంతీయ అటవీ అధికారి శ్రీనివాసులరెడ్డి, డీఎఫ్‌ఓ త్రిమూర్తులు, రెవెన్యూ, కాలుష్య నియంత్రణ మండలి అధికారులున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com