ఏలూరు ప్రజలు ఎందుకు పడిపోతున్నారో కారణం చెప్పిన ఎయిమ్స్ డాక్టర్లు: బీజేపీ ఎంపీ జీవీఎల్

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రజలకు అంతుచిక్కని వ్యాధితో ఆస్పత్రి పాలవుతున్నారు.. గత నాలుగు రోజులుగా దాదాపు 350 మంది వరకు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో జాయినవుతున్నారు. కోలుకున్నవారు ఏం జరిగిందో, ఎందుకు అలా అపస్మారక స్థితిలోకి వెళ్లిందీ కారణం చెప్పలేకపోతున్నారు. వారికి కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. వైద్యులు కూడా ఈ వ్యాధి ఏంటన్నది గుర్తించలేకపోతున్నారు.
దిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్ల బృందం నమూనాలను పరిశీలించింది. ఏలూరు ప్రజల అస్వస్థతకు భారలోహం సీసమే కారణమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సోమవారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ అనే లోహాల అవశేషాలు ఎక్కువగా ఉన్నట్లు ఎయిమ్స్ డాక్టర్లు చేసిన పరీక్షల్లో నిర్ధారణ అయిందని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాలను మంగళగారి ఎయిమ్స్ ద్వారా రాష్ట్రప్రభుత్వానికి అందించినట్లు చెప్పారు.
స్థానికంగా ఉన్న తాగునీరు, పాల నమూనాలను పంపాలని దిల్లీ ఎయిమ్స్ నిపుణులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. సీసం కారణంగానే న్యూరో టాక్సిక్ లక్షణాలు కనబడతాయని, బ్యాటరీల్లో ఉండే ఈ లోహం తాగునీరు, పాల ద్వారా రోగుల శరీరంలోకి వెళ్లి ఉండొచ్చని వైద్యులు అభిప్రాయపడినట్లు జీవీఎల్ పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com