AP: 1500 రోజులకు చేరిన అమరావతి ఉద్యమం

అమరావతి పరిరక్షణే ఊపిరిగా అమరావతి రైతులు, మహిళలు చేస్తున్న పోరాటం నేటితో 15వందల రోజులకు చేరింది. 2019 డిసెంబరు 17న అసెంబ్లీలో సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఎగసిన అమరావతి ఉద్యమం మరో మైలురాయికి చేరింది. ప్రభుత్వ దాష్టీకాలు, దమనకాండను తట్టుకుని 15 వందల రోజులకు చేరింది. ప్రతిపక్ష నేతగా అమరావతిని ఆహ్వానించిన జగన్.. అధికారంలోకొచ్చాక మాటతప్పి, మడమ తిప్పేశారు. అమరావతిపై అనుక్షణం విషం కక్కడమే పనిగా పెట్టుకున్నారు. అమరావతి నిర్మాణ పనుల్ని నిలిపివేసి.. విధ్వంసానికి తెరతీశారు. అధికార పార్టీనేతలతో అమరావతి శ్మశానమని, ఎడారి అని నోటికొచ్చినట్టు మాట్లాడించారు. అమరావతి నేల, భారీ నిర్మాణాలకు పనికిరాదని, పునాదులకే బోలెడు ఖర్చవుతుందంటూ కట్టుకథలు చెప్పారు. ఎగువ నుంచి నీటి ప్రవాహాలు వస్తుంటే..సకాలంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా ఎగువన నీటి మట్టం పెంచి అమరావతిని ముంచేయాలని, అది రాజధాని నిర్మాణానికి పనికిరాదని చాటి చెప్పాలనీ కుట్ర పన్నారు.
2014లో రూపొందించిన పాఠ్యపుస్తకంలో... సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద అమరావతి పాఠ్యాంశంగా ఉండగా.. ఆ పేరే గిట్టని జగన్ సర్కార్ దాన్ని సిలబస్ నుంచి తొలగించేసింది. ఉద్దండరాయనిపాలెంలో అమరావతికి అట్టహాసంగా శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని ఇప్పుడు పశువులు, గొర్రెలకు వదిలేసింది. జగన్ అంతలా రాజధానిపై పగ సాధిస్తున్నారు. రైతుల ఉద్యమాన్ని అణచివేసేందుకు జగన్ చెయ్యని దుర్మార్గం లేదు. వేల సంఖ్యలో పోలీసుల్ని రాజధాని గ్రామాల్లోకి దించారు. 144 సెక్షన్, పోలీసు చట్టంలోని సెక్షన్ 30 వంటివి ప్రయోగించి అష్టదిగ్బంధం చేశారు. ఉద్యమం తొలినాళ్లలో పోలీసులు పేట్రేగిపోయారు. ఇళ్లల్లోకి వెళ్లి అర్ధరాత్రి తనిఖీల పేరుతో భయభ్రాంతుల్ని చేశారు. గ్రామాల్లో కవాతులు చేసి అక్కడి ప్రజల్ని భయపెట్టారు.
2020 జనవరిలో విజయవాడ కనక దుర్గమ్మకు పొంగళ్లు సమర్పించి, తమ గోడు వెళ్లబోసుకునేందుకు వెళ్తున్న మహిళల్ని అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దానికి నిరసగా... రాజధాని గ్రామాల్లో బంద్ పాటిస్తే మందడంలో దీక్ష చేస్తున్న మహిళలపై లాఠీలతో విరుచుకుపడ్డారు. ఒక గర్భిణిని... పోలీసు అధికారి ఒకరు కాలితో తన్నడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు.! హైకోర్టు జోక్యం చేసుకుని పోలీసుల్ని తీవ్రంగా మందలించడంతో గ్రామాలపై పోలీసుల ఉక్కు పిడికిలిని కొంత సడలించారు. 2020 జనవరి 20న చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన రైతులు అడ్డంకుల్ని, అవరోధాల్ని దాటుకుని శాసనసభ సమీపానికి చేరుకోవడంతో..పోలీసులు వారిపైనా లాఠీలు ఝళిపించారు. 2021 మార్చి 8న మహిళా దినోత్సవం రోజున విజయవాడ కనకదుర్గ గుడికి వెళుతున్న మహిళలపై పోలీసులు మరోసారి విరుచుకుపడ్డారు. ఈ నాలుగేళ్ల ఉద్యమ ప్రస్థానంలో... వారి దాష్టీకానికి నిదర్శనంగా నిలిచిన ఇలాంటి ఘటనలు అనేకం. సుమారు 3 వేల మంది రైతులు, మహిళలు, రైతు కూలీలు, ఉద్యమ మద్దతుదారులపై ప్రభుత్వం 720కిపైగా అక్రమ కేసులు నమోదు చేసింది.
ఎన్నో కష్టనష్టాలు, ఆంక్షల్ని, బెదిరింపుల్ని, అక్రమ కేసుల్ని ఎదుర్కొంటూ రాజధాని రైతులు మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. అసాధారణ బలం, బలగం కలిగిన ప్రభుత్వాన్ని ఢీకొట్టి నిలబడిన సాధారణ రైతులకు..వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో పాటు తెలుగువారంతా మద్దతుగా నిలిచారు. 3 రాజధానుల నిర్ణయం, ప్రభుత్వ దమనకాండతో మనస్థాపం చెంది అనేక మంది ఉద్యమకారులు, రైతులు,........ కూలీలు అశువులు బాశారు. రాజధానికి నిర్మాణానికి భూములిచ్చిన వారు వారి కల సాకారం కాకముందే కన్నుమూశారు. అమరావతి ఐకాస వివరాల ప్రకారం...ఇప్పటి వరకు 250 మందికి పైగా చనిపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com