AP : విశాఖ ఉక్కు కర్మాగారంపై కుట్రలు ?

AP : విశాఖ ఉక్కు కర్మాగారంపై కుట్రలు ?

విశాఖ ఉక్కు కర్మాగారంపై కుట్రలు కొనసాగుతున్నాయా? నష్టాలు వచ్చేలా చేసి.. చీప్‌గా అమ్మేయాలని చూస్తున్నారా? వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులతో పాటు.. కార్మిక వర్గాలు ఇదే నిజమని ముక్తకంఠంతో చెబుతున్నాయి. దేశంలోనే స్టీల్‌ ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం విలువ దారుణంగా పడిపోయింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 3 వేల 50 కోట్ల నష్టం వచ్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఆ ఏడాది ప్రారంభంలో ప్లాంటు నికర విలువ 3 వేల 175 కోట్లు ఉండగా.. నష్టాల వల్ల అది ఇప్పుడు 199 కోట్లకు పడిపోయింది. దాదాపు 3 లక్షల కోట్ల విలువైన RINLను కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రమే వ్యూహాత్మకంగా నష్టాలు వచ్చేలా చేస్తోందని.. ఉద్యోగ, కార్మిక వర్గాలు ఆరోపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు సొంత గనులివ్వాలని దశాబ్దాలుగా కార్మిక సంఘాలు పోరాడుతున్నా.. కేంద్రం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన NMDC బైలదిల్లాలో ముడి ఇనుప ఖనిజం తవ్వి టన్నుకు 5 వేల చొప్పున విక్రయిస్తోంది. సదరు గనుల నుంచి తవ్వడానికి ఆ సంస్థకు టన్నుకు 7 వందలు మాత్రమే ఖర్చవుతోంది. కానీ 5 వేలకు విక్రయించడం ప్లాంటుకు మోయలేని భారంగా మారింది. సొంత గనులుంటే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, లాభాలు పెరుగుతాయని మొత్తుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక బైలదిల్లా నుంచి ఐరన్‌ఓర్‌ను గూడ్సు రైళ్ల ద్వారా తెచ్చుకోవడానికి రైల్వే శాఖకు విశాఖ స్టీల్స్‌ ఏడాదికి 2 వందల కోట్లు అదనంగా చెల్లిస్తోంది.

వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ విస్తరణకు కేంద్రం ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. సొంత నిధులు వెచ్చించి, ఆ తర్వాత అవి చాలక 25 వేల కోట్లు రుణాలు తీసుకుంది. ఈ అప్పులపై నెలకు 150 కోట్ల వరకు వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఈ భారం తగ్గించుకోవడానికి 3 వేల కోట్లు సర్దుబాటు చేయాలని RINL 2017లోనే కేంద్రాన్ని కోరింది. కార్పొరేట్‌ శక్తులకు దీనిని కట్టబెట్టాలనే ప్లాన్‌లో ఉన్న కేంద్రం ఈ విన్నపాలను బుట్టదాఖలు చేసింది. దీంతో.. RINL నెలకు 150 కోట్లు చొప్పున ఏడాదికి 18 వందల కోట్లు చెల్లిస్తూనే వస్తోంది. ఇప్పుడు కూడా నిర్వహణ మూలధనం కోసం కనీసం 3వేల కోట్ల నుంచి 5 వేల కోట్లు కావాలని కోరుతుంటే.. దానికి కూడా కేంద్రం అంగీకరించడం లేదు. పరోక్షంగా నష్టాలు పెరిగేలా చేస్తోంది. దాంతో సంస్థ నికర విలువ పడిపోతోంది.

ఐతే.. విశాఖ ఉక్కు నష్టాలకు ఎవరు కారణం? విశాఖ ఉక్కు నష్టాలకు ఉద్యోగులు, కార్మికులు కారణం కాదని.. ఆర్థిక వ్యవహారాల వల్లే నష్టాలు వస్తున్నాయని గతంలో రాజ్యసభలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. 2022-23లో 3 వేల 49 కోట్ల నష్టాలు వచ్చాయని చెబుతున్న ఉక్కు శాఖ... దానికి ముందు ఏడాది అదే సంస్థ 913 కోట్ల లాభాలు సాధించిన విషయాన్ని గుర్తించడం లేదు. ఆ లాభాల పరంపరకు సహకారమూ అందించలేదు. గత ఏడాదిలో ముడి పదార్థాలు అందకుండా, రుణాలు లభ్యం కాకుండా అనేక అడ్డంకులు సృష్టించింది. దాంతో ఒక బ్లాస్ట్‌ ఫర్నేస్‌ మూతపడింది. ఫలితంగా ఉత్పత్తి తగ్గిపోయి, వ్యయాలు మరింత పెరిగి నష్టాలు చూడాల్సి వచ్చింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో 201 కోట్లు, రెండో త్రైమాసికంలో 14 వందల 94 కోట్లు, మూడో త్రైమాసికంలో 1 వెయ్యి 57 కోట్లు, నాలుగో త్రైమాసికంలో 298 కోట్ల నష్టాలు వచ్చాయి. 2021-22లో విశాఖ ఉక్కు టర్నోవర్‌ 28 వేల 215 కోట్లు ఉండగా.. 2022-23లో 24 వేల 50 కోట్లకు తగ్గిపోయింది. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా కటకటలాడుతున్న ప్రస్తుత తరుణంలో.. 2023-24లో 31 వేల 264 కోట్ల టర్నోవర్‌ సాధిస్తామని ఉక్కు శాఖ గొప్పలు చెబుతోంది. ఉక్కు రంగాన్ని కేంద్రం పూర్తిగా కార్పొరేట్‌ శక్తులకు కట్టబెట్టడానికి నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆ శాఖకు పూర్తిస్థాయి మంత్రులు లేకుండా చేసింది. RINLలో కూడా పూర్తిస్థాయి డైరెక్టర్ల బోర్డు లేకుండా ప్లాంటును నడుపుతున్నారు. ఇలా అన్ని విధాలుగా సహాయ నిరాకరణ చేసి విశాఖ ఉక్కు విలువ పడిపోయేలా చేయడంలో కేంద్రం సక్సెస్ అయ్యింది. ప్లాంట్‌ నికర విలువ 199 కోట్లకు పడిపోవడంతో ఏ ఆర్థిక సంస్థా సాయం చేయడానికి ముందుకురాదు. దాంతో కార్పొరేట్‌ శక్తులు డిమాండ్‌ చేసిన ధరకు కట్టబెట్టడం తప్ప మరో మార్గం లేదు.

Tags

Read MoreRead Less
Next Story