Modi Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు

Modi Cabinet: ఏపీ నుంచి కేంద్ర మంత్రులుగా ముగ్గురు
కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌ , భూపతిరాజు శ్రీనివాసవర్మ

కేంద్ర మంత్రిమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా, కేబినెట్ మంత్రులు, సహాయ మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏపీ నుంచి తెలుగుదేశం తరుపున కేంద్ర మంత్రిగా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్‌ ప్రమాణ స్వీకారం చేయగా, బీజేపీ నుంచి భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

కింజరాపు రామ్మోహన్‌నాయుడు... శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి, ఎర్రన్నాయుడు. బీటెక్‌, ఎంబీఏ పూర్తి చేసిన రామ్మోహన్‌ వయస్సు 36 సంసవత్సరాలు. ఆయనకు భార్య శ్రావ్య, కుమార్తె ఉన్నారు. తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబర్‌ 2న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తర్వాత రామ్మోహన్‌ నాయుడు రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో శ్రీకాకుళం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో సైకిల్‌ యాత్ర చేసి పార్టీ శ్రేణులకు, ప్రజలకు చేరువయ్యారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున తొలిసారి పోటీచేసి లక్షా 27 వేల ఓట్లకుపైగా మెజార్టీలో శ్రీకాకుళం ఎంపీగా గెలుపొందారు. 2019లో సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 5 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం ఓటమిపాలయినా..ఆయన మాత్రం ఎంపీగా గెలిచి పట్టు నిలుపుకున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 3 లక్షల 27వేల ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగానూ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

గుంటూరు జిల్లా తెనాలి మండలం బుర్రిపాలెంలో జన్మించిన పెమ్మసాని చంద్రశేఖర్‌ తల్లిదండ్రులు సువర్చల, సాంబశివరావు. MBBS, MD పూర్తిచేసిన చంద్రశేఖర్‌ వయసు 47 ఏళ్లు. భార్య డాక్టర్‌ శ్రీరత్న. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్‌ తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపారరీత్యా నరసరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్యగా నరసరావుపేట ప్రాంత ప్రజలకు చిరపరిచితులు. చంద్రశేఖర్‌ ఎంసెట్‌లో 27వ ర్యాంకు సాధించి, ఉస్మానియా మెడికల్‌ కళాశాలలో MBBS సీటు సాధించారు. పీజీ చదవడం కోసం అమెరికా వెళ్లిన ఆయన అక్కడ యునైటెడ్ స్టేట్స్‌ మెడికల్ లైసెన్సింగ్ ఎగ్జామ్‌ పూర్తి చేయడంతో అక్కడే స్థిరపడ్డారు. ఇక 2014లో నరసరావుపేట పార్లమెంట్‌ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన పేరు ఖారరైనా రాజకీయక పరిణామాల నడుమ రాయపాటి సాంబశివరావు బరిలోకి దిగారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచి మెుదటి ప్రయత్నంలోనే కేంద్ర మంత్రి అయ్యారు.

భూపతిరాజు శ్రీనివాసవర్మ, కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి తరఫున భారీ మెజార్టీతో విజయం సాధించిన శ్రీనివాస వర్మకు కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. శ్రీనివాసవర్మ 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. మాస్టర్‌ లైబ్రెరియన్‌ కోర్సు చదివిన వర్మ లైబ్రేరియన్‌గా ఉద్యోగం చేశారు. ఆ తర్వాత భాజపాలో చేరిన శ్రీనివాసవర్మ రెండు దశాబ్దాల పైగా పార్టీలోనే కొనసాగుతున్నారు. సంఘ్‌ పరివార్‌తో సత్ససంబంధాలు కలిగిన శ్రీనివాసవర్మ, ఏబీవీపీలో చురుగ్గా పనిచేసి పార్టీలో గుర్తింపు పొందారు. 1992 నుంచి 95 మధ్యలో జిల్లా యువమోర్చా అధ్యక్షుడిగా పనిచేశారు. 2008 నుంచి 2014 వరకు రెండు పర్యాయాలు భాజపా జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. 2014లో భీమవరం పురపాలక వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందారు. ఇన్‌ఛార్జి ఛైర్మన్‌గానూ సేవలందించారు. తాజాగా కూటమి తరఫున నర్సాపురం అభ్యర్థిగా పోటీచేసిన భూపతిరాజు శ్రీనివాసవర్మ..వైకాపా అభ్యర్థి ఉమాబాలపై భారీ మెజార్టీతో గెలుపొందారు.

Tags

Read MoreRead Less
Next Story