300వ రోజుకు అమరావతి ఉద్యమం.. RDO కార్యాలయాల ముట్టడి
అమరావతి భగ్గుమంటోంది. 295రోజులుగా 29 గ్రామాల్లో ఉద్యమ సెగలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారు రైతులు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఇప్పటికైనా వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.. ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా.. ప్రభుత్వానికి చీమ కుట్టినట్టైనా లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే అమరావతిని కాపాడుకునే వరకూ...పోరాటం ఆగదంటున్నారు రైతులు..
అమరావతి ఉద్యమం 3 వందల రోజులకు సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో జేఏసీ నాయకులు సమావేశమై ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అమరావతి రైతుల ఆవేదన.. దేశవ్యాప్తంగా తెలిసేలా నిరసన కార్యక్రమం చేపట్టాలని భావిస్తున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని మహిళా జేఏసీ నేతలు చెబుతున్నారు. 300వ రోజున రాష్ట్రంలోని అన్ని RDO కార్యాలయాల ముట్టడి కార్యక్రమం చేపడుతామని తెలిపారు. అంతే కాకుండా జైల్ భరో వంటి కార్యక్రమాలకు కూడా సిద్ధంగా ఉన్నామన్నారు మహిళా జేఏసీ నేతలు.
మరోవైపు మంత్రుల వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తున్న అమరావతి రైతులను పోలీసులు అరెస్టు చేశారు. మంత్రులు ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ తుళ్లూరు రైతులు ఉద్యమ శిబిరం వద్ద ఆందోళన చేపట్టారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఎండలో కూర్చుని నిరసన తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు.. రైతులను అరెస్టు చేసి పోలీస్టేషన్ కు తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.
అమరావతి గ్రామం వెంకటపాలెంలో రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. మంత్రుల మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... శవయాత్ర చేపట్టారు. 294 రోజులుగా ఉద్యమం చేస్తుంటే తమను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com