365 items for groom: ఆయ్.. గోదారోళ్లతో యవ్వారం మామూలుగా ఉండదండీ.. కాబోయే అల్లుడికి అద్దిరిపోయే ఆతిధ్యం

365 Items: గోదారోళ్ల చేతిలో డబ్బుండాలే కానండీ.. పంచభక్ష్య పరమాన్నాలతో ప్రేమనంతా ఒలికించేస్తారు కొత్త అల్లుళ్లమీద. కొత్త ఏడాదిలో వచ్చిన తొలి పండుగ. సక్రాంతి సంబరాలతో ఊరంతా హడావిడి.. పట్నం అల్లుళ్లంతా పండక్కి పల్లెలకి వచ్చి సందడి చేస్తుంటారు.. కోడిపందాలు, కోడి కూర ఘుమఘుమలు.. ప్రతి ఇంటా ప్రేమ పూర్వక పలకరింపులు.. ఊరంతా అందాల హరివిల్లులు.. మనవరాలిని మనువాడబోయే యువకుడికి ఓ తాతగారు సంవత్సరం పాటు తల్చుకునేలా గొప్ప ఆతిధ్యం ఇచ్చారు.. 365 వంటకాలు చేయించి తన ప్రేమని చాటుకున్నారు. ఈ వార్త వైరల్ అవడంతో గోదారోళ్లా మజాకా అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.
కాబోయే అల్లుడినే కాదు.. కోరి చేసుకున్న కొత్త అల్లుడికి అంతకు మించి మర్యాదలు చేయడం గోదారాళ్లకు మహా ఇష్టం. తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం, అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన విజయలక్ష్మి జ్యూయలర్స్ అధినేత అత్యం వెంకటేశ్వరరావు మాధవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది.
పెళ్లికి ముందే సంక్రాంతి పండుగ రావడంతో పెళ్లి కుమార్తె తాతా ఆచంట గోవింద్, నాగమణి దంపతులు కాబోయే నూతన వధూవరులకు నరసాపురంలో ఆతిథ్యం ఇచ్చారు. తాతగారు తగ్గేదేలే అంటూ మనవడికి 365 వంటకాలు తయారు చేయించి రుచి చూపించారు. మరవన్నీ నిజంగానే తిన్నాడో లేదో కానీ సోషల్ మీడియాలో మాత్రం వైరల్ అయ్యింది. వంద రకాల స్వీట్లు, పులిహోర, దద్దోజనం, 30 రకాల కూరలు, పిండి వంటలతో ఘనమైన ఆతిధ్యం ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com