AP: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు.. రూ.9,417 కోట్లు

AP: ఏపీ రైల్వే ప్రాజెక్టులకు.. రూ.9,417 కోట్లు
X
వెల్లడించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ... నేడు రైల్వే మంత్రితో లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ లో రైల్వే స్టేషన్ల అభివృద్ధికి రూ.9,417 కోట్లు కేటాయించామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాంతో పోలిస్తే ఈ కేటాయింపులు 11 రెట్లు ఎక్కువని గుర్తు చేశారు. ఏపీలో మొత్తం రూ.84,559 కోట్లతో వివిధ ప్రాజెక్టులు నడుస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఏపీలో కొత్తగా 1,560 కి. మీల రైల్వే ట్రాక్స్ వేశామని.. 73 రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుస్తున్నామని వెల్లడించారు. ఈ కొత్త లైన్ అమరావతి నుంచి గుంటూరు, విజయవాడ, హైదరాబాద్, చెన్నై సహా పలు ప్రాంతాలను కలుపుతుందని చెప్పారు. 2009-14 మధ్యకాలంలో నాటి యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సగటు వార్షిక కేటాయింపు రూ.886 కోట్లతో పోలిస్తే, ఇది 11 రెట్లు అధికమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.

ఏపీలో పనుల పురోగతి

ప్రస్తుతం ఏపీలో రూ.80,097 కోట్ల నిధులతో 43 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. మొత్తం 5,560 కిలోమీటర్ల పొడవున పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే మంజూరైన ప్రాజెక్టులకు రూ.84,559 కోట్లు వెచ్చించబోతున్నామని.. 73 రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయిలో నవీకరించడానికి రూ.2,051 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు. 2009-14 మధ్యకాలంలో ఏటా సగటున 73 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లు నిర్మించగా, 2014-25 మధ్య అది 142 కి.మీ.కు పెరిగిందన్నారు,

అశ్వినీ వైష్ణవ్ తో నారా లోకేశ్ భేటీ

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో నారా లోకేశ్ సమావేశం కానున్నారు. రైల్వే బడ్జెట్‌కు సంబంధించి కీలక అంశాలను మంత్రితో లోకేశ్ చర్చించనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. లోకేశ్ సా.5.45 గంటలకు అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అవుతారు. రాష్ట్రానికి రైల్వే బడ్జెట్లో కేటాయించిన రూ.9,417 కోట్లపై ప్రాధాన్యంగా చర్చించనున్నారు.

Tags

Next Story