AP News : అసభ్యంగా ప్రవర్తించాడని వ్యక్తి హత్య

AP News : అసభ్యంగా ప్రవర్తించాడని వ్యక్తి  హత్య
X
కువైట్‌ నుంచి వచ్చి వృద్ధుడిని చంపేసిన తండ్రి

కన్న కూతురికి జరిగిన అన్యాయాన్ని భరించలేకపోయిన ఓ తండ్రి దారుణ నిర్ణయం తీసుకున్నాడు. కుమార్తెపై అత్యాచారానికి యత్నించిన వృద్ధుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ బాలిక తండ్రి వీడియో రిలీజ్‌ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులను ఆశ్రయించినప్పటికీ పట్టించుకోకపోవడంతోనే.. తానే స్వయంగా కువైట్‌ నుంచి వచ్చి మరీ హత్య చేయాల్సి వచ్చిందని ఆ వీడియోలో బాలిక తండ్రి పేర్కొన్నారు.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామంలో గత శనివారం తెల్లవారుజామున నిద్రిస్తున్న ఓ వికలాంగుడైన గుట్ట ఆంజనేయులు (59)ని దారుణంగా హత్య చేశారు. వృద్ధుడి తలపై ఓ దుండగుడు ఇసుప రాడ్డుతో బలంగా మోదీ హత్య చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. వృద్ధుడిని చంపేంత కోపం ఎవరికి ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. అయినప్పటికీ ఈ కేసులో ఎలాంటి ముందడుగు పడలేదు. ఇదే సమయంలో కువైట్‌ నుంచి ఆ వృద్ధుడి బంధువు ఒక వీడియో రిలీజ్‌ చేశాడు. అందులో ఆ వృద్ధుడిని చంపింది తానేనని వెల్లడించడం సంచలనంగా మారింది. అయితే ఆ వృద్ధుడిని ఎందుకు చంపాల్సి వచ్చిందో కారణం కూడా వివరించారు.

మంగంపేటకు చెందిన చంద్రకళ, ఆంజనేయ ప్రసాద్‌ దంపతులు కొంతకాలం క్రితం బతుకుదెరువు కోసం కువైట్‌ వెళ్లారు. గల్ఫ్‌ దేశం వెళ్తూ తమ ఒక్కగానొక్క కుమార్తె (12)ను చంద్రకళ చెల్లెలు లక్ష్మీ, వెంకటరమణ దంపతుల ఇంట్లో ఉంచి వెళ్లారు. వెంకటరమణ తండ్రి ఆంజనేయులు మనమరాలు వరస అయ్యే ఆ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. కానీ ఈ విషయాన్ని దాచిన శశికళ.. కువైట్‌లో ఉంటున్న తన అక్కకు ఫోన్‌ చేసి తమ కుమార్తెను తీసుకెళ్లాలని చెప్పింది. దీంతో చంద్రకళ ఇండియాకు వచ్చి కుమార్తెను కువైట్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత ఏమైందని కుమార్తెను అడగ్గా.. భయపడుతూ జరిగిన విషయం మొత్తం బయటపెట్టింది.

తాను నిద్రిస్తున్న సమయంలో తాత (ఆంజనేయులు) తన దుస్తులు మొత్తం తీసేసి, నోరు నొక్కి బలత్కారం చేయబోయాడని చెప్పింది. భయంతో కాసేపు అలాగే ఉండిపోయానని, ఆ తర్వాత గట్టిగా అరవడంతో పిన్ని వచ్చి కాపాడిందని చెప్పుకొచ్చింది. దీంతో కోపోద్రేక్తుడైన ఆంజనేయ ప్రసాద్‌.. తన మరదలికి ఫోన్‌ చేసి విషయం అడిగారు. ఆమె సరిగ్గా స్పందించకపోవడంతో ఓబులవారిపల్లె పోలీసులకు ఫిర్యాదు చేయాలని కుమార్తె, భార్యను మళ్లీ ఇండియాకు పంపించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, వారు కేవలం మందలించి వదిలేశారు. ఈ విషయాన్ని ఆంజనేయ ప్రసాద్‌కు అతని భార్య చెప్పడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఆడపిల్లపై అసభ్యకరంగా ప్రవర్తించినా పోలీసులు పట్టించుకోకపోవడం ఏంటని మనస్తాపం చెందాడు. దీంతో ఓ నిర్ణయానికి వచ్చాడు. అనుకున్నదే తడవుగా కువైట్‌ నుంచి శనివారం ఇండియా వచ్చి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్న ఆంజనేయులు తలపై ఇనుప రాడ్డుతో మోది హత్య చేసి వెంటనే కువైట్‌ వెళ్లిపోయాడు.

కువైట్‌ వెళ్లిపోయిన అనంతరం ఆంజనేయ ప్రసాద్‌ జరిగిన విషయం మొత్తాన్ని చెబుతూ ఒక వీడియో చిత్రీకరించాడు. దాన్ని సోషల్‌మీడియాలో పోస్టు చేస్తూ.. ఆడబిడ్డ తండ్రిగా తాను చేసింది న్యాయమేనని భావిస్తున్నట్లు చెప్పారు. తనకు చట్టంపై గౌరవం ఉందని, త్వరలోనే లొంగిపోతానని చెప్పాడు.

Tags

Next Story