Kadapa: ప్రాణాలను కాపాడిన పోలీస్.. వరదను లెక్కచేయకుండా సాహసం..

Kadapa: ఏదైనా ప్రమాదంలో ఇరుక్కున్నప్పుడే సాటి మనిషిలోని మానవత్వం మనకు అర్థమవుతుంది. వరదలు, భారీ వర్షాలు పడుతున్న సమయంలో ఒకరికొకరు సాయం చేసుకుంటేనే ఆ కష్టం నుండి గట్టెక్కగలరు. ఆంధ్రప్రదేశ్‌లో గులాబ్ తుఫాన్ ఎఫెక్టుకు ఇప్పటికీ ఎందరో జీవితాలు అతలాకుతలం అయిపోయాయి. లోతట్టు ప్రాంతాలలోకి నీరు వచ్చేయడంతో అక్కడ ఇళ్లలో ఉంటున్న వారు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
ఇలాంటి సమయంలోని అందరు ఒకరికొకరు సాయంగా నిలబడుతున్నారు. నీరు నిండిపోయిన ఇళ్లలో నుండి మనుషులను బయటికి తీసుకురావడానికి అందరూ కలిసి కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు చేదోడుగా నిలబడ్డాడు ఒక పోలీస్ ఆఫీసర్. పోలీసులపై ఎప్పటికప్పుడు ఎన్ని విమర్శలు వచ్చినా ప్రజలకు కష్టం వచ్చిందని తెలిస్తే మాత్రం కొందరు ఏ మాత్రం వెనకాడకుండా అండగా ఉంటారు.
అలాంటి పోలీసులను ఇప్పటికి ఎందరినో చూసాం. వాళ్లలో ఒకరే కడప జిల్లాకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ నరేంద్ర. గులాబ్ తుఫాన్ కారణంగా కడప జిల్లాలో చెరువు పొంగి రోడ్డు మీద ప్రవహిస్తుంది. అదే రోడ్డులో బైక్‌పై వస్తున్న ఓ వ్యక్తి వరద ధాటిని తట్టుకోలేక బండి మీద నుండి పడిపోయాడు. ప్రవాహం ఎక్కువ ఉండడంతో ఒక్కసారిగా అందులో కొట్టుకుపోసాగాడు. రెండు క్షణాలు ఆలస్యం అయ్యింటే అతడు అందులో నుండి బయటపడడం కూడా కష్టమయ్యేది.
అదే సమయంలో అక్కడే ఉన్న పోలీస్ కానిస్టేబుల్ నరేంద్ర ఆ వ్యక్తి బైక్‌పై నుండి పడగానే అలెర్ట్ అయ్యాడు. అందుకే వరదను లెక్కచేయకుండా వెళ్లి అతడు ప్రవాహంలో కొట్టుకుపోకుండా కాపాడాడు. ఇదంతా వీడియో రికార్డు అవ్వడంతో అది చూసిన వారంతా నరేంద్రను ప్రశంసిస్తున్నారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడుతున్న ఇలాంటి పోలీసులు ఉండడం మనకు గర్వకారణం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com